అగ్రకథానాయిక సమంత అక్కినేని కోలీవుడ్ ఆడియన్స్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్ నటుడు మనోబాల డిమాండ్ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'(The Family Man 2) వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. అయితే, ఈ సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలువురి నుంచి విమర్శలను అందుకుంది. తాజాగా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వివాదం గురించి నటుడు మనోబాల స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందిస్తూ.. పలు కామెంట్లు చేశారు.
"'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను ఇబ్బందిపెట్టేలా ఉంది. ఇలాంటి సిరీస్‌లో నటించినందుకు సమంత(Samantha) తప్పకుండా క్షమాపణలు చెప్పితీరాలి. రాజీ పాత్ర విషయంలో కూడా చిత్రబృందం సామ్‌ను మోసం చేసింది. ఒక పోరాటయోధురాలిగా ఆమెకు ఈ పాత్ర గురించి వర్ణించినప్పటికీ.. ఈలం పోరాటం క్షీణత తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారు. ఇలాంటి కథను ఒప్పుకొనే ముందు సమంత ఇంకొంత ఆలోచించాల్సింది. సామ్ క్షమాపణలు చెప్పినా సరే.. చిత్రబృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకూ సిరీస్‌కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం."
-మనోబాల, సీనియర్ నటుడు.