చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు 'ఆస్కార్'. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏట వచ్చే నెల 9న ఈ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. 92వ అకాడమీ వేడుకను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది నుంచి మెగా వేడుకను వ్యాఖ్యాత లేకుండా నిర్వహిస్తూ ఆశ్చర్యపర్చిన నిర్వాహకులు.. తాజాగా మరో ఆసక్తికర ప్రణాళికకు ఆమెదం తెలిపారు.
ఆకుపచ్చని వంటకాలే..
ఈ ఏడాది జరగనున్న వేడుకలో దాదాపు 70 శాతం వంటకాలు ఆకుపచ్చని రంగులోనే దర్శనమివ్వనున్నాయి. దీనికి కారణం అన్నీ ఆకుకూరలతోనే వండాలని నిర్ణయించడమే. మిగతా 30 శాతంలో కాయగూరలు, చేపలు, మాంసం సంబంధిత వంటకాలు ఉంటాయట. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా పండిచినవే కావడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు 7ఏళ్లుగా కృషి చేస్తోంది అకాడమీ.
తొమ్మిది సినిమాల పోటీ..
ఈసారి ఉత్తమ చిత్రం కేటగిరికి ఏకంగా తొమ్మిది సినిమాలు నామినేట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకున్న 'జోకర్' చిత్రం 11 విభాగాల్లో నామినేట్ అయింది. 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', 'ది ఐరిష్ మ్యాన్','1947' చిత్రాలు 10 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఈ నాలుగు చిత్రాలు 'ఉత్తమ చిత్రం' కేటగిరీలోనూ పోటీ పడుతున్నాయి. వీటి తర్వాత పారాసైట్(6), మ్యారేజ్ స్టోరీ(6), లిటిల్ ఉమెన్(6), బాంబ్ షెల్(3) చిత్రాలు అత్యధికంగా నామినేషన్లు దక్కించుకున్నాయి.