సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీని (సీసీసీ) ఏర్పాటు చేసిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి నటుడు జేడీ చక్రవర్తి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమాపై ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. వీరి కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రముఖులంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పరిశ్రమలోని పేదలకు నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీ చక్రవర్తి ప్రత్యేకంగా చిరుకు లేఖ రాశారు.
'చిరుకు నేను అభిమానినే, అనుచరుడ్ని కాదు' - చిరుకు అభినందనలు తెలిపిన చక్రవర్తి
ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు.. కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు నటుడు జేడీ చక్రవర్తి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌కు ఓ బహిరంగా లేఖ రాశారు.
"ప్రియమైన చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మిమ్మల్ని నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్ర వేళల్లో మీతో కలిసి సమయం గడపడానికి ఆసక్తి చూపేవారు. నేనెప్పుడూ మీ దగ్గరికి రాలేదు.. రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ. చిత్ర పరిశ్రమ ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు. నాతోపాటు మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. అభిమానులే కాదు.. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో, నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న పనే (సీసీసీని ఉద్దేశించి) నిదర్శనం. మీరు మెగాస్టార్ కాదు, అంతకంటే ఎక్కువ.. ఓ గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అభివర్ణించాలి. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు నాకు ఫోన్ చేశారు. తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారని తెలిపారు. మీరు చిత్ర పరిశ్రమ రుణం తీర్చుకుంటున్నానని అంటున్నారు. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. మీ హృదయం సరైన స్థానంలో ఉంది. చాలా మందికి హృదయం ఉంటుంది. కానీ అది సరైన స్థానంలో ఉండదు, వీరిలో నేను కూడా ఒకడ్ని. ఇప్పుడు నేను మెగాస్టార్‌ని మరింత అభిమానిస్తున్నా. నలుగురి ఆనందం కోరుకునే మీ వ్యక్తిత్వం గొప్పది. నేనెప్పటికీ మీ అభిమానిని.. ఇకపై మీ అనుచరుడిని. మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి"
-జేడీ చక్రవర్తి, సినీనటుడు