తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆకాశం అమ్మాయైతే' పాట అలా పుట్టింది - ఆకాశం అమ్మాయైతే సాంగ్​ వార్తలు

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'గబ్బర్‌సింగ్‌' చిత్రంలోని 'ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే..' అనే పాట శ్రోతల్ని ఎంతగానో అలరించింది. ఇప్పటికీ ఏదో ఓ చోట మారుమోగుతూనే ఉంది. దేవీశ్రీప్రసాద్‌ స్వర కల్పనలో చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ అద్భుత గీతం ఎలా పుట్టిందో మీకు తెలుసా?

That is how the song 'Aakasam Ammai Aithy Nela Untundy' was born
'ఆకాశం అమ్మాయి అయితే!' పాట అలా వచ్చింది

By

Published : Nov 11, 2020, 3:44 PM IST

చిత్రపరిశ్రమలో సినీ రచయితలు కొన్నిసార్లు సంగీత దర్శకులు ఇచ్చిన బాణీలకు సాహిత్యం రాయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో రచయితలు సందర్భాన్ని బట్టి సాహిత్యం అందిస్తే సంగీత దర్శకులు ట్యూన్‌ చేయాలి. అదే విధంగా 'గబ్బర్​సింగ్​' చిత్రం కోసం 'ఆకాశం' అనే పదంలో పాటకు దేవీ ట్యూన్‌ వినిపించి చంద్రబోస్‌ని రాయమన్నారట. నాయకానాయికల మధ్య సాగే ప్రేమగీతంగా రాయమని చెప్పగా.. నేడు ప్రేమ సున్నితంగా లేదు, విధ్వంసంగా ఉంది కదా అనుకుని 'గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే.. కళ్లలో భూచక్రాలే తిప్పింది నువ్వే' అనే పల్లవి పూర్తి చేశారు. ఇది దర్శకుడు హరీశ్‌ శంకర్‌కు వినిపించగా.. డబ్బింగ్‌ పాటలా ఉందని సమాధానం ఇచ్చారట.

'తెలుగుదనం ఉట్టిపడేలా రాయండి' అని కోరగా ఈసారి 'తెలుగింటి తులసి మొక్క నీలా ఉంటుందే.. కోవెల్లో కొబ్బరి ముక్క నీలా ఉంటుందే' అనే పల్లవి రాశారు. దీన్ని డీఎస్పీకి చెప్పగా ఈ కాలానికి తగ్గట్లు ట్రెండీగా రాయండన్నారు. పాట ఇవ్వడానికి మూడు రోజులే ఉండటం వల్ల భయంతో ఉన్న చంద్రబోస్‌ ఓ సాయంత్రం పెట్రోల్‌ కోసం బంకుకు వెళ్లారు. కారు డోర్‌ తీసి పెట్రోలు పోసే అమ్మాయిని చూసిన చంద్రబోస్‌ వెంటనే ఆకాశాన్ని చూశారట. అమ్మాయి, ఆకాశం.. ఆకాశం, అమ్మాయి అనుకుంటూ 'ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే' పల్లవి రాశారు. అలా పెట్రోలు బంకులో ఈ పాట పుట్టిందని ఓ సందర్భంలో తెలిపారు చంద్రబోస్‌. పవన్‌ కల్యాణ్, శ్రుతిహాసన్‌ నర్తించిన ఈ గీతం ఎప్పటికీ ప్రత్యేకమే.

ABOUT THE AUTHOR

...view details