పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్త చిత్రం 'వకీల్సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దిల్‌రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్కు నెట్టింట మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ సినిమాలోని మొదటి పాట 'మగువ మగువ' విడుదలై ఏడాది కావస్తోన్నా.. మరో పాట ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన చిత్రబృందం అభిమానులకు సర్‌ప్రైజ్‌ల ప్యాకేజ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
మార్చి నెల 'వకీల్సాబ్ మ్యూజికల్ మార్చ్'గా నిలిచిపోతుందని పేర్కొంటూ ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. మార్చిలో ఈ చిత్రంలోని మిగిలిన పాటలను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది. రెండో పాట మహిళా దినోత్సవమైన మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.