స్టార్ హోదా అనుభవిస్తూ సైకిల్‌పై ఎవరు ప్రయాణం చేయగలరు? ఒక్కో చిత్రంతో కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ సాధారణ వ్యక్తిగా ఉండటం ఎవరికి సాధ్యం? ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండే మనస్తత్వం ఎవరి సొంతం? పడినా లేచి యథాస్థితికి చేరుకునే ధైర్యం ఎవరిది? ఇలాంటి అసాధారణ ప్రశ్నలకు ఓ సమాధానమే అజిత్. సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే ఈ నటుడి పుట్టిన రోజు శనివారం(మే 1). ఈ సందర్భంగా అజిత్‌లో దాగి ఉన్న మరికొన్ని కోణాల్ని ఓసారి చూద్దామా..
ఇక్కడే పుట్టారు..
సుబ్రహ్మమణియన్- మోహిని దంపతులకు 1971 మే 1న హైదరాబాద్‌లో జన్మించారు అజిత్. ఈయనకు ఇద్దరు సోదరులు. ఉన్నత విద్య అభ్యసించడాని కంటే ముందే కుటుంబ సన్నిహితుడి ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో అప్రెంటీస్ మెకానిక్‌గా చేరారు అజిత్. అది వాళ్ల నాన్నకు నచ్చకపోవడంతో మరొక సన్నిహితుడి ప్రమేయంతో వస్త్ర ఎగుమతి సంస్థలో చేరారు. అలా వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. అక్కడే ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. కొన్నాళ్లకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. దాంతోపాటు మోడలింగ్‌కు సంబంధించి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగింది అజిత్‌కు. అలా ఓసారి ప్రముఖ మోటారు కంపెనీకి వెళ్లినప్పుడు ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అజిత్‌లోని నటుడ్ని గుర్తించారు. ఆ మెకానిక్కే ఇప్పుడు తలా అజిత్‌గా మారి సంచనాలు సృష్టిస్తున్నారు.
తలా.. ఇలా వచ్చింది
1990లో ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ అనే చిత్రంతో నటుడిగా తెరంగ్రేటం చేశారు అజిత్. అందులో ఓ చిన్న పాత్రకు పరిమితమైనా ఆయన 1993లో ‘అమరావతి’ సినిమాతో కథానాయకుడిగా మారారు. అదే సంవత్సరంలో తెలుగు చిత్రం ‘ప్రేమ పుస్తకం’లో నటించారు. అజిత్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే. ‘ప్రియురాలి పిలిచింది’, ‘వాలి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నారు. లవర్‌బాయ్, క్లాస్ పాత్రల్లో కనిపించిన అజిత్‌ను మాస్ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం ‘ధీన’. ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నటుడిగా ఆయన స్థాయిని పెంచింది. అందులో పోషించిన పాత్ర పేరే అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది. తమిళం, తెలుగుతోపాటు ‘ఆశోక’ అనే హిందీ చిత్రంలో షారుక్ ఖాన్‌తో కలిసి నటించారు. ‘విలన్’, ‘జి’, ‘ఆల్వార్’, ‘కిరీదం’, ‘బిల్లా’, ‘బిల్లా 2’, ‘ఆరంభం’, ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ తదితర చిత్రాలు అజిత్ నట విశ్వరూపానికి నిదర్శనం. అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్ కావాలంటూ క్రికెట్ మైదానంలోనూ ఇటీవల అభిమానులు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అజిత్ ఫాలోయింగ్‌ను అందరికీ తెలియజేసింది. ఇలా అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ విశేష అభిమాన గణాన్నే కాదు అనేక అవార్డులు రివార్డుల్ని సొంతం చేసుకున్నారు.
పడినా లేచి..
తొలి సినిమా విడుదల తర్వాత రేసింగ్ వైపు మనసు మళ్లింది అజిత్‌కు. ఆ శిక్షణా సమయంలోనే ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. మూడు శస్త్ర చికిత్సలు కాగా సుమారు రెండేళ్లు విశ్రాంతి తీసుకున్నారు. కోలుకున్నాక పలు సహాయ పాత్రల్లో నటించారు. ‘ఆశై’ అనే సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అందులోని అజిత్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. సినీ కెరీర్ పరంగా అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. రేసింగ్‌లో ఓ సారి దెబ్బతగిలిందని అక్కడితో దాన్ని వదిలేయలేదు అజిత్. దాన్నీ ఓ కెరీర్‌గా ఎంచుకున్నారు. ఎన్నో విదేశీ పోటీల్లో పాల్గొన్ని సత్తా చాటారు. రేసరే కాదు అజిత్‌లో ఫొటోగ్రాఫర్, చెఫ్ కూడా ఉన్నారు. ఆ సంగతులివీ..
రేసర్‌గా అజిత్..
‘బీఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్ జరుగుతున్నప్పుడు మొదటిసారి నేను అజిత్‌ని కలిశాను. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ అందరితోనూ వినయంగా ఉంటారని అప్పుడే తెలిసింది. బ్రెజిల్ రేసర్ ఐర్టన్ సెన్నాకు అజిత్ వీరాభిమాని తను. సెన్నాకు నివాళిగా హెల్మెట్ మీద పసుపు రంగు పెయింటింగ్‌ని తీర్చిదిద్దారు అజిత్. బైక్ ట్రిప్‌కు వెళ్లే అవకాశం వచ్చిన సమయంలో ఓసారి అజిత్ ఇంటికి వెళ్లాను. తన గ్యారేజీలో ఉన్న కార్లను చూసి ఆశ్చర్యపోయాను. కార్లు ఎక్కువగా ఉండటం గొప్ప విషయం కాదు వాటిని ఎంత జాగ్రత్తగా చూస్తున్నామో అన్నదే పాయింట్. దాన్ని నేను అజిత్ నుంచి నేర్చుకున్నాను. రైడింగ్ అంటే అజిత్‌కు ప్యాషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉత్సాహం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల్ని నడపకూడదు అంటుంటారాన. నీ దగ్గర రాకెట్ వేగంతో దూసుకెళ్లే బైక్ ఉన్నంత మాత్రాన ముందూ వెనకా చూడకుండా ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తారు. ఇదీ ఆయన పద్ధతి. అజిత్ నిజంగా మంచి వ్యక్తేనా అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అవును.. అజిత్ గురించి మీరు విన్నదంతా వందశాతం నిజం అని సమాధానం ఇస్తుంటాను నేను’ అని ప్రముఖ రేసర్ సుహైల్ ఓ సందర్భంలో అజిత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
చెఫ్‌గా..
అజిత్ రేసర్ మాత్రమే కాదు మంచి వంట మనిషి కూడా. షూటింగ్ లేని రోజున ఆయన బిర్యానీని ఘుమఘుమలాడించేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు సైతం అజితే తీసుకెళ్తారు. 2011లో అజిత్ నివాసానికి దగ్గర్లో విజయ్ హీరోగా రూపొందిన ‘వేలాయుధం’ చిత్రీకరణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్ చిత్ర బృంద సభ్యులందర్నీ ఆహ్వానించి, తనే స్వయంగా భోజనం ఏర్పాటు చేశారు. అదీ అజిత్ మనసు.