మాస్ కథలతో ప్రయాణం చేసే అగ్రహీరోలు కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తున్న రోజులివి. తమ మార్క్ మాస్ అంశాలతోపాటు.. కథల్లో ఇంకేదో నవ నేపథ్యం ఉండాలని తపిస్తున్నారు. అవసరమైతే జానర్‌లు(telugu movies) మార్చాలని, భిన్నమైన పాత్రలు భుజానికెత్తుకోవాలని, సాహసాలకు సిద్ధం కావాలని యత్నిస్తున్నారు. కొద్దిమంది హీరోలు వేస్తున్న అడుగుల్ని... వాళ్ల ప్రయాణాన్ని గమనిస్తే ఆ పనిలోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వారెవరు? ఆ వివరాలేంటి?
'యువ హీరోలపై ఇప్పుడున్న ఓ పెద్ద బాధ్యత... కొత్త రకమైన కథలతో ప్రయాణం చేయడం. మేమందరం ఆ బాధ్యతని స్వీకరించాల్సిందే' - హీరో నాగచైతన్య ఇటీవల చెప్పిన మాట ఇది. పడికట్టు సూత్రాలతో కూడిన టెంప్లేట్ కథలకు కాలం చెల్లింది. వాస్తవికతతో కూడిన సినిమాలకే ఇప్పుడు ఆదరణ దక్కుతోంది. ఓటీటీ వేదికల ఉద్ధృతి తర్వాత తెలుగు సినిమా(tollywood news) కథాగమనం పూర్తిగా మారిపోయింది. అందుకు తగ్గట్టుగానే యువ హీరోలు అడుగులు వేస్తున్నారు. ఇదివరకు తోటి హీరోలు ఎలాంటి సినిమాలతో హిట్ కొట్టారో గమనించి, అలాంటి కథలతో ప్రయాణం చేయడానికే ప్రయత్నించేవాళ్లు. దర్శకనిర్మాతలూ అదే సురక్షితం అని నమ్మేవారు. ఇప్పుడు ఆ రూటు మారింది. ఒకొక్కరు ఒక్కో నేపథ్యంతో కూడిన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారు. కథలో నిజాయతీ ఉందంటే.. అలాంటివి ఇదివరకు వచ్చాయా లేదా? ఆడాయా లేదా? అని ఆలోచించకుండా భుజానికెత్తుకుంటున్నారు. భిన్నమైన కథలు వెలుగు చూడటానికి ఇదొక కీలక పరిణామం అంటున్నారు సినీ పండితులు.
ఎన్నెన్నో భిన్న కోణాలు
ఒకరు రాజకీయ నేపథ్యం, మరొకరిది స్పై కథ, ఇంకొకరేమో ప్రేక్షకులకు థ్రిల్ పంచాలని నిర్ణయించారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథలు, స్పోర్ట్స్ డ్రామాలు, పీరియాడికల్ కథలు.. ఇలా ఒకటేమిటి యువ హీరోల ప్రయాణాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో ఎన్ని రకాల కథల్ని ఆస్వాదించనున్నామో అర్థమవుతుంది. ఇటీవలే నాని కుటుంబ కథతో 'టక్ జగదీష్'గా(tuck jagadish movie) ప్రేక్షకుల ముందుకొచ్చారు. పీరియాడికల్ కథతో 'శ్యామ్ సింగరాయ్' పూర్తి చేశారు. గిలిగింతలు పెట్టే మరో కొత్త రకమైన కథతో 'అంటే సుందరానికి' చేస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో కూడిన మరో కథను ఎంపిక చేసుకున్నారు. యువ కథానాయకుడు రామ్ ఈసారి పక్కా మాస్ అంటున్నారు. లింగుస్వామితో జట్టు కట్టిన ఆయన పోలీస్ పాత్రలోనూ సందడి చేస్తారని సమాచారం. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త రుచులు పంచుతానని గట్టిగా చెబుతున్నారు.
వీరి మాట.. కొత్త బాట