దేశంలో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షలు దాటేసింది. సామాన్యుల నుంచి మంత్రులు, సినీ నటులు ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే ఎంతో ఉత్తమమని అన్నారు. ఒక వేళ వ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
"కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోకండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారిన పడటం కన్నా ముందు జాగ్రత్త ఎంతో అవసరం. ఒకవేళ మీలో ఎవరైనా కరోనా పాజిటివ్ అని తెలిసినా విచారించాల్సిన అవసరం లేదు. దృఢంగా ఉండండి. స్వీయ గృహ నిర్బంధంలో ఉండండి. మీతోటి వారికి దూరంగా ఉండండి. అప్పుడే మార్పు సాధ్యం. మీ ప్రేమాభిమానాల వల్ల నేను బాగున్నా. త్వరలోనే మరింత దృఢంగా మీ ముందుకు వస్తా."