తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిరివెన్నెల నటించిన ఏకైక సినిమా,  పాడిన పాట.. ఏంటో తెలుసా?

sirivennela sitaramasastry died: ఎన్నో వేల పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని మీకు తెలుసా?. అంతేకాకుండా ఆయన కొన్ని గీతాలను స్వయంగా ఆలపించారు కూడా. ఇంతకీ ఆయన నటించిన చిత్రం సహా పాడిన తొలి పాట ఏంటంటే?

సిరివెన్నెల సీతారామశాస్త్రి , sirivennela
సిరివెన్నెల సీతారామశాస్త్రి

By

Published : Dec 1, 2021, 5:34 AM IST

sirivennela sitaramasastry died: సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కలంతో ఎన్నో వేల పాటలు రాసి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు. అయితే ఆయన్ను వెండితెరపై చూపించడానికి చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన తనకు వచ్చిన అవకాశాల్ని సున్నితంగా తిరస్కరించారు. కానీ ఒక్క సినిమాలో మాత్రం కనిపించి సందడి చేశారు. అదే సీనియర్ నటుడు జగపతిబాబు నటించిన 'గాయం' సినిమా. దర్శకుడు రామ్​ గోపాల్​ వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలోనే సిరివెన్నెల నటించారు.

ఈ మూవీలోని సిరివెన్నెల రచించిన 'నిగ్గదీసి అడుగు' పాట ఎంతగానో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సాంగ్​లో ఆయన నటన అభిమానులను అలరించింది. ఆ తర్వాత 'మనసంతా నువ్వే' చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారాయన.

కాగా, సిరివెన్నెల కలం నుంచి వచ్చిన పదాల్ని వేరే గాయకులు ఆలపించడం చూశాం. కానీ ఆయనే రాసి, బాణీ కట్టి ఆలపించిన గీతాలూ ఉన్నాయి. అందులో తొలి గీతం 'కళ్లు' సినిమాలోని 'తెల్లారింది లెగండోయ్‌...' పాట. సినిమాల్లో పాటలు రాసే సిరివెన్నెల... అసలు ఎందుకు పాడాల్సి వచ్చిందో ఓ సందర్భంలో ఆయనే వివరించారు.

" కళ్లు అనే సినిమా సారాంశం అంతా ఉండేలా ఆ పాట రాశాను. నా అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు ఆ పాటను తీసుకెళ్లి వినిపించాను. మొత్తం విన్నాక... ‘ఈ పాటను నువ్వే పాడేయ్‌ తమ్ముడు’ అని అన్నారు. తొలుత వద్దనుకున్నాను. అయితే అన్నయ్య రిహార్సల్‌, రిహార్సల్‌ అని చెప్పి... నాతో పాట పాడించేశారు. పదిసార్లు రిహార్సల్‌ అయ్యాక... ధైర్యం చేసి టేక్‌ చేద్దామా అని అడిగాను. దానికి అన్నయ్య... ‘నేను టేక్‌ తీసుకున్నాను. ఫర్వాలేదు వచ్చేయ్‌. బాగానే పాడావు’ అని చెప్పారు. ఆ తర్వాత పాట అందించిన విజయం ఎప్పటికీ మరచిపోలేను"

-సిరివెన్నెల సీతారామశాస్త్రి, గేయరచయిత.

ఇదీ చూడండి: Sirivennela died: సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే

ABOUT THE AUTHOR

...view details