"నేను ఓ కథను కథలాగే వింటా. ఇది చిన్న చిత్రమా.. పెద్ద సినిమానా అని చూడను. పాత్ర నచ్చితేనే ఓకే చెబుతాను. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాను" అంటోంది నటి పూర్ణ. 'సీమటపాకాయ్', 'అవును' లాంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ కేరళ భామ.. ఇప్పుడు 'అఖండ'లో (akhanda cast) ఓ కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబరు 2న (akhanda release date) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం.. హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది పూర్ణ. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
ఇన్నాళ్లకు మీ సినీ కెరీర్ వేగం పుంజుకున్నట్లుంది కదా?
అవునండి. 2011లో నా తొలి చిత్రం 'సీమ టపాకాయ్' విడుదలైంది. ఇప్పుడీ 2021లో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమయ్యా. దాదాపు పదేళ్ల ప్రయాణం తర్వాత ఇలాంటి అవకాశాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకంటూ చాలా పరిమితులుండేవి. ఇలాంటి కాస్ట్యూమ్స్ మాత్రమే ధరించాలి.. ఫలానా పాత్రలే చేయాలి అనుకునే దాన్ని. అందువల్లే వరుస సినిమాలు చేయలేకపోయా. ఏదేమైనా ఇప్పుడు బోయపాటి - బాలకృష్ణల కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంలో నేను భాగమయ్యా. ఎంతో సంతృప్తిగా ఉంది.
మీ పరిమితుల వల్ల అవకాశాలు కోల్పోతున్నప్పుడు ఏమైనా బాధపడేవారా?
బాధ ఏమీ లేదు. ఏ పాత్రయినా నాకు నచ్చితేనే ఒప్పుకొంటాను. పాత్ర డిమాండ్ చేస్తే.. నాకు నచ్చిన కాస్ట్యూమ్ వేసుకుంటాను. ఇవన్నీ ముందే ఆలోచించి పాత్రకు ఓకే చెబుతాను. ఎందుకంటే సెట్‌కు వెళ్లాక ఇది వేసుకోను.. అది వేసుకోను అంటే అందరికీ సమస్యే. అలాగని నాకు సౌకర్యంగా లేని దుస్తులు ధరించి షూట్లో ఇబ్బంది పడలేను. డబ్బే కావాలనుకుంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యొచ్చు. కెరీర్ బాగుండాలి.. సుదీర్ఘంగా సాగాలి అంటే మంచి చిత్రాలే ఎంచుకోవాలి. ఇంత జాగ్రత్తగా ఆలోచించినా.. ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం సహజమే. అలా కెరీర్ ఆరంభంలో నేను చాలా తప్పులే చేశాను.
'ఢీ' షో మీ కెరీర్‌కు ప్లస్ అయిందనుకోవచ్చా?
కచ్చితంగా. టీవీల్లో కనిపిస్తే మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయో? రాదో అనే అనుమానం మొదట్లో ఉండేది. కానీ, నేను చాలా లక్కీ. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయంలో నాకు 'ఢీ' షో ఎప్పుడూ ప్లస్ అవుతూనే ఉంది. కొన్ని తప్పులు మాట్లాడుతున్నా కూడా ఇప్పుడింత చక్కగా తెలుగు మాట్లాడుతున్నానంటే కారణం 'ఢీ'నే.
'అవును' సినిమా చేసే సమయంలోనే బోయపాటి సర్ నుంచి నాకు ఓ మంచి ఆఫర్ వచ్చింది. అనుకోని కారణాల వల్ల అది నేను చేయలేకపోయా. నిజానికి ఇప్పుడీ చిత్రంలో నేను పోషించిన పాత్రను తొలుత మరో నటిచేయాల్సింది. తర్వాత ఆ పాత్రకు నన్ను సంప్రదించగానే షాకయ్యా. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాది ఓ చిన్న పాత్రై ఉంటుందేమో అనుకున్నా. బోయపాటి సర్ కథ గురించి.. నా పాత్రకున్న ప్రాధాన్యత గురించి చెప్పాక చాలా ఆనందంగా అనిపించింది. నేనిందులో పద్మావతి అనే పాత్రలో కనిపిస్తా. నిడివి కాస్త తక్కువైనా.. చాలా బలమైన పాత్ర. అలాగని నెగటివ్ రోల్ మాత్రం కాదు. కథానాయకుడికి.. ప్రతినాయకుడికి మధ్య అనుసంధానంగా ఉంటుంది.