తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెరపై నాన్నలు.. గుర్తుండిపోతారు కలకాలం! - నువ్వు నాకు నచ్చావ్ ప్రకాశ్ రాజ్

నాన్న అంటే ఓ బాధ్యత, ప్రేమ, క్రమశిక్షణ, ధైర్యం, రక్షణ, నమ్మకం. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజజీవితంలోనే కాకుండా వెండితెరపైనా కొందరు నాన్నలు మన జీవితాంతం గుర్తుండిపోతారు. తండ్రులంటే ఇలానే ఉంటారేమో అనేంతలా నటించి అభిమానుల్ని ఫిదా చేశారు. ఇటీవల విడుదలైన 'ఉప్పెన' చిత్రంలో హీరోయిన్​ తండ్రిగా విజయ్ సేతుపతి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో మనకు గుర్తిండిపోయిన నాన్న పాత్రలేంటో చూద్దాం.

Telugu movies that deal with Father emotion in a beautiful way
తెరపై నాన్నలు

By

Published : Feb 27, 2021, 5:31 PM IST

Updated : Feb 27, 2021, 5:56 PM IST

నాన్న అంటే బాధ్యత, ప్రేమ, క్రమశిక్షణ, ధైర్యం, రక్షణ, నమ్మకం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. నాన్న తిట్టినా, కొట్టినా మనమంచి కోసమే. మన ఎదుగులలో తోడ్పాటును అందిస్తారు. సరైన మార్గం చూపిస్తారు. కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తారు. మన జీవితంలోని ప్రతి క్షణం ఆయన ఇచ్చిన వరమే. నిజజీవితంలోనే కాకుండా వెండితెరపైనా ఇలా అన్ని వేరియేషన్స్​ను చూపించిన కొన్ని నాన్న పాత్రలు, మన తెలుగు సినిమాల్లోనూ ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'ఉప్పెన' చిత్రంలో హీరోయిన్​ తండ్రిగా విజయ్ సేతుపతి ఆకట్టుకున్నారు. కన్న కూతురు, పరువు గురించి ఆలోచించే తండ్రులు ఇలానే ఉంటారా? అనేంతగా పాత్రలో లీనమైపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో ఇప్పటివరకు వచ్చి ఆకట్టుకున్న డాడీ పాత్రలపై ఓ లుక్కేద్దాం.

ఉప్పెన (2021)

'ఉప్పెన' విడుదలకు ముందు నుంచి టాలీవుడ్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించిన అంశం విజయ్ సేతుపతి ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించడం. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఇందులో నాయకానాయికా పాత్రలతో పాటు హీరోయిన్​ తండ్రిగా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. కన్న కూతురు ప్రేమ వ్యవహారంలో పరువు కోసం పాకులాడే తండ్రి పాత్రలో మెప్పించారు. విలనిజాన్ని ప్రదర్శిస్తూనే క్లైమాక్స్​లో కూతురు ప్రేమకు కరిగిపోయిన తండ్రిగా చూపించి.. అతడి పాత్రకు కాస్త పాజిటివ్​ కోణాన్ని జోడించారు దర్శకుడు. ఇందులో హీరో తండ్రిగా నటించిన సాయిచంద్ కూడా పాత్రకు జీవం పోశారు.

నాన్నకు ప్రేమతో(2016)

'నాన్న.. నన్ను వెంటాడే ఓ ఎమోషన్​' అంటూ తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు సుకుమార్. రాజేంద్రప్రసాద్-జూ.ఎన్టీఆర్.. వారి వారి పాత్రల్ని అద్భుతంగా పోషించారు. తమ తండ్రిని ఆర్థికంగా, మానసికంగా మోసం చేసిన ప్రతినాయకుడ్ని.. ఆయన ముగ్గురు కొడుకులు ఏ విధంగా మట్టుబెట్టారు అనేది చిత్ర కథాంశం.

సన్నాఫ్ సత్యమూర్తి(2015)

తండ్రి మరణానంతరం, ఓ సంఘటన వల్ల ఆస్తి మొత్తం కోల్పోయిన కొడుకు.. ఆ తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నాన్నపై పడిన అపవాదుల్ని ఎలా రూపుమాపాడు? చివరగా ఆయన్ను అందరూ మంచి అనేలా ఏం చేశాడు? అనేదే 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా. ఉన్నది కొంతసేపే అయినా, తన నటనా చాతుర్యంతో నాన్నగా మనసు దోచారు ప్రకాశ్​రాజ్. కుమారుడి పాత్రలో అల్లు అర్జున్ అద్భుత నటన కనబరిచారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007)

మధ్యతరగతి కుటుంబంలో తండ్రీకొడుకులు అంటే ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'. వారి పాత్రల్లో కోట శ్రీనివాసరావు-వెంకటేశ్.. మనల్ని నవ్వించారు, ఏడిపించారు, ఎమోషన్ తెప్పించారు. చివరకు ఓ అద్భుతమైన సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చారు. సెల్వ రాఘవన్ దీనికి దర్శకుడు.

బొమ్మరిల్లు(2006)

'బొమ్మరిల్లు ఫాదర్'.. ఈ ఒక్క పదం చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఈ సినిమాలోని నాన్న పాత్రను ప్రేక్షకులు ఆదరించారు. తండ్రిగా ప్రకాశ్​రాజ్, కుమారుడిగా సిద్దార్థ్ కనబరిచిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే 'బొమ్మరిల్లు'ను తన స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు దర్శకుడు భాస్కర్, గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నువ్వునాకు నచ్చావ్(2001)

పేరుకే రొమాంటిక్ కామెడీ సినిమా అయినా ఇందులో తండ్రీకొడుకు, నాన్న-కూతురు మధ్య ఉండే భావోద్వేగాల్ని ఎంతో చక్కగా చూపించారు. వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పుడు చూసిన మీ ముఖంపై నవ్వు తెప్పిస్తుందీ చిత్రం. ప్రకాశ్​రాజ్, చంద్రమోహన్​.. బిడ్డల బాగు కోసం తపన పడే తండ్రి పాత్రల్లో జీవించేశారు.

వీటితో పాటే 7/జీ బృందావన కాలనీ, కొత్త బంగారు లోకం, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, సుస్వాగతం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, రఘువరన్ బీటెక్​ సినిమాల్లోని తండ్రి పాత్రలూ.. మన మనసుల్లో చోటు సంపాదించాయి.

ఇవీ చూడండి: అతిలోక సుందరి నందన.. నీ సొగసుకు వందనం

Last Updated : Feb 27, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details