గతేడాది లాక్‌డౌన్‌లో ఓటీటీ వేదికల ద్వారా విడుదలైన తెలుగు సినిమాలు చాలానే. థియేటర్లు తెరుచుకుంటాయో? లేదో? అనే సందేహాలు.. తెరచుకున్నా ప్రేక్షకులు వస్తారో? రారో? అనే భయాలతో కొద్దిమంది నిర్మాతలు నేరుగా ఓటీటీ వేదికల్లో సినిమాల్ని విడుదల చేశారు. కానీ ఈసారి ఆ ఊసే లేదు. థియేటర్లు బంద్ అయినా.. కరోనా విజృంభణ కొనసాగుతున్నా... నిర్మాతలు 'వేచి చూద్దాం' అనే ధోరణిలో కనిపిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో కనిపిస్తున్నారు.
కరోనాకు ముందు వరకు తెలుగు ప్రేక్షకులపై ఓటీటీ వేదికల ప్రభావం అతి స్వల్పం. ప్రధాన నగరాల్లో కొద్దిమందే ఆ మాధ్యమాలపై ఆసక్తి చూపేవారు. గతేడాది లాక్‌డౌన్ తర్వాత ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి. థియేటర్‌లోనే సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఓటీటీలకు అలవాటు పడిపోయారు. నచ్చిన వేదిక సభ్యత్వం తీసుకోవడం.. దాన్ని ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి పంచుకుంటూ నచ్చిన సినిమాల్ని ఇంటిల్లిపాదీ కలిసి చూడటం అలవాటైపోయింది. తెలుగు సినిమాలే కాదు, ఆయా వేదికల్లో అందుబాటులో ఉన్న ప్రపంచ సినిమాల్ని, వెబ్‌సిరీస్‌ల్ని వేటినీ వదిలిపెట్టకుండా చూసేసినవాళ్లు చాలామందే. అది గమనించిన నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ వేదికల్లో విడుదల చేసుకోవడమే మేలనే అభిప్రాయానికొచ్చారు. ప్రేక్షకుల ఆదరణ దృష్టిలో ఉంచుకుని ఓటీటీ వేదికలు రూ.వందల కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన సినిమాల్ని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపించాయి. అలా నిర్మాతలకూ, ఓటీటీ యాజమాన్యాలకూ మధ్య బేరాలు కుదరడం వల్ల చాలా చిత్రాలు ఆ వేదికల ద్వారా విడుదలయ్యాయి. తెలుగులో అయితే నాని - సుధీర్‌బాబు నటించిన ‘వి’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, అనుష్క ‘నిశ్శబ్దం’, సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మొదలుకొని ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘పెంగ్విన్’ తదితర చిత్రాలు రకరకాల వేదికల ద్వారా విడుదలై ప్రేక్షకుల్ని పలకరించాయి.
ఈ సారి అలా కాదు..