కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాహాళ్లలో తిరిగి ప్రదర్శన మొదలుపెట్టినా.. ప్రేక్షకుల వస్తారా? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ మెదిలింది. ఈ నేపథ్యంలో గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు వచ్చిన స్పందన తర్వాత కొత్త చిత్రాలను రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు. ఆ విధంగా సంక్రాంతికి ముందు, తర్వాత థియేటర్లలో సందడి చేయడానికి పలు సినిమా సిద్ధమయ్యాయి. అందులో మొదటగా విడుదలైన చిత్రం 'క్రాక్'. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆ తర్వాత 'మాస్టర్', 'రెడ్', 'అల్లుడు అదుర్స్' ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
క్రాక్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. ఇందులో రవితేజ నటనకు, దర్శకుడి కథనానికి మంచి మార్కులే పడ్డాయి. ముగ్గుల పండక్కి నాలుగు రోజుల ముందుగానే వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది.
మాస్టర్
దళపతి విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన 'మాస్టర్' చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 13(బుధవారం)న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ 'ఖైదీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల దీనిపై అభిమానులలో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే పైరసీ భూతం ఆవహించింది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీనిపై స్పందించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, చిత్రబృందం.. సినిమాకు సంబంధించిన లింక్స్‌ను షేర్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పైరసీ ప్రభావం వల్ల కలెక్షన్లపై పడుతుందేమో! అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.