'ఉప్పెన' సినిమా రిలీజైన రెండు నెలల తర్వాత ఆ సినిమాలో ఎడిటింగ్‌లో భాగంగా కత్తిరించిన కొన్ని సీన్లను యూట్యూబ్‌లో పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సీన్లలో ఒకదాంట్లో హీరోయిన్‌కు ప్రేమలేఖ ఇవ్వడానికి తన పొరుగున ఉండే అమ్మాయి సాయం తీసుకోవాలనుకుంటాడు హీరో. అందుకోసం బతిమాలుతూ ఒప్పించే సీన్ ఇది. 'రావోయి ఒలె భామ..' అని సాగే జానపదం సీన్ మొత్తం ఉంటుంది.
సినిమాలో కత్తిరించి యూట్యూబ్‌లో అతికించిన మరో సీన్ కూడా జానపదమే. 'జీబు గారి సెందరమ్మ.. ఈదుబిల్లి అప్పారావు'.. అని ఉండే ఈ పాటను హీరో తన స్నేహితుడితో కలిసి సరదాగా పాడుతూ డ్యాన్స్ చేస్తాడు. ఇటీవల కొన్ని సినిమాల్లో జానపదాల్ని పెట్టడంవల్ల వాటికి మంచి ఆదరణ వస్తోంది. ఈ రెండు పాటలూ ఆ కోవలోకి వస్తాయి. ఇవి సినిమాకు అదనపు హంగు తెచ్చి పెట్టేవే కానీ, నిడివి దృష్ట్యా కోత తప్పలేదని చెప్పాలి. ఈ సినిమా నుంచి తొలగించిన మరో సీన్ విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య ఉంటుంది. సీరియస్‌గా సాగే ఈ సీన్ విలనిజం చూపించడానికి తీసింది.
2021లో వచ్చి హిట్ అయిన 'జాతిరత్నాలు'లోని డిలీటెడ్ సీన్లకూ యూట్యూబ్‌లో పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. వీటిలో చాలావరకూ వాటికవే నవ్వు తెప్పించే సీన్లు కాగా, కొన్ని మాత్రం కథకు బలం చేకూర్చేవి. ఆరేసి నిమిషాలు నిడివి ఉండే రెండు భాగాలుగా ఈ సీన్లను యూట్యూబ్‌లో పెట్టింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. సినిమా చూసినవాళ్లకు ఇవి బోనస్.. చూడనివాళ్లకు చూడాలన్న కోరికను పుట్టిస్తాయి.
మహానటికి కోటి వ్యూస్..
కొత్త దర్శకులూ, హీరోల సినిమాలకే ఈ డిలీటెడ్ సీన్లు పరిమితం అనుకుంటే పొరపాటే. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాకు సంబంధించి కూడా ఓ డిలీటెడ్ సీన్ వచ్చింది. రెండు నిమిషాల నిడివి ఉండే ఆ సీన్లో అల్లు అర్జున్, సుశాంత్‌ల మధ్య సంభాషణ సాగుతుంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్2' సినిమాలో కత్తిరించిన కొన్ని కామెడీ సీన్లను ఒక వీడియో క్లిప్‌గా రిలీజ్ చేశారు నిర్మాత దిల్‌రాజు. దానికి వచ్చిన వ్యూస్ 50 లక్షలకు పైనే.
అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటి ఎంత హిట్టో తెలిసిందే. కీర్తి సురేశ్, దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమాలోని ప్రతి సీనూ అద్భుతమే. అయినా కూడా నిడివి మూలాన కొన్ని సీన్లు సినిమాలో పెట్టలేని పరిస్థితి. అందులోని నటి రేఖ ప్రస్తావన వచ్చే సీన్‌ని యూట్యూబ్‌లో మాత్రమే విడుదల చేశారు. దీనికి కోటికిపైగా వ్యూస్ వచ్చాయంటే నమ్మగలరా. ఇదే సినిమాకు సంబంధించి థియేటర్‌లో కనిపించని నాలుగైదు సీన్లనీ యూట్యూబ్లో పెట్టారు.
డిజిటల్ మహిమ
'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు', 'రంగస్థలం', 'టెంపర్', 'మహర్షి', 'ఆర్‌ఎక్స్ 100'.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు సంబంధించి కూడా థియేటర్ వెర్షన్ల నుంచి తొలగించిన సీన్లు యూట్యూబ్‌లో కనిపిస్తాయి. షూటింగ్ సమయంలోనే ఒకే సీన్‌కు రెండు వెర్షన్లు తీయడం. కొన్ని సీన్లు అదనంగా తీయడం సాధారణం. ఎడిటింగ్ సమయంలో వాటిలోంచి కొన్ని సీన్లు కత్తిరిస్తారు. ఫిల్ములు వాడే కాలంలో అలా కత్తిరించిన రీళ్లు కాలగర్భంలో కలిసిపోయేవి. ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్‌లో తీయడం, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ఉండటం వల్ల అలాంటి క్లిప్‌లు వృథా కాకుండా అభిమానుల్ని అలరించడానికి ఇలా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ కనిపించే వాటిలో కొన్ని సీన్లను చూసినపుడు సినిమా నుంచి ఎందుకు తీసేశారా అనిపిస్తాయి. కొన్ని తీసేసి మంచి పని చేశారనిపిస్తాయి. కారణం ఏదైనా సగటు సినిమా అభిమానిని సంతోష పెట్టడమే వీటి ఉద్దేశం!
ఇదీ చూడండి..'అమ్మనయ్యాక.. నా నటనలో మార్పు వచ్చింది!'