తమిళ కథానాయకుడు విజయ్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరో తమిళ స్టార్ ధనుష్ మన దర్శకుడు శేఖర్ కమ్ములతో జట్టు కట్టనున్నారు. ధనుష్ మరో తెలుగు దర్శకుడితోనూ సినిమాకు పచ్చజెండా ఊపేశారు. సూర్య, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి.. ఇలా పలువురు హీరోల కోసం మన తెలుగు దర్శకులు కథలు సిద్ధం చేశారు. అగ్ర దర్శకుడు శంకర్.. మన హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ పనిచేస్తున్నారు. రామ్‌తో తమిళ దర్శకుడు లింగుస్వామి జట్టుకట్టారు. మురుగదాస్, లోకేష్ కనగరాజ్.. ఇలా పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ క్షణంలోనైనా తెలుగు కథానాయకులతో సినిమాల్ని ప్రకటించొచ్చని మాట్లాడుకుంటున్నారు.
అందుకే..
సినిమా రూపకల్పనలో నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగిందో.. వ్యాపార విస్తృతి అంతే పెరిగింది. థియేటర్ రూపేణా కాకుండా.. ఓటీటీ, శాటిలైట్, ఇతరత్రా సామాజిక మాధ్యమాల వేదికల రూపంలోనూ సినిమాకు ఆదాయం సమకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బహు భాషల్లో గుర్తింపున్న హీరోలతోనూ, దర్శకులతోనూ సినిమాలు చేస్తే అందరికీ లాభదాయకం. నిర్మాతల ఆ వ్యూహాల్ని అనుసరించి కాంబినేషన్లను సెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇదివరకెప్పుడూ చూడని కొత్త కలయికలు సెట్ అవుతున్నాయి.
అలాగే కరోనాతో వచ్చిన విరామం వల్ల కూడా దర్శకుల దగ్గర కథలు పేరుకుపోయాయి. ఆ కథల్ని చేయడానికి సరిపడా కథానాయకులు దొరకడం లేదు. దాంతో దర్శకులు పొరుగు భాషలపైనా దృష్టిపెడుతూ అక్కడి కథానాయకులకు చెప్పి ఒప్పిస్తున్నారు. మార్కెట్ పరిధి పెరుగుతుందని తమిళ దర్శకులు తెలుగు కథానాయకులతో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల వాళ్లు మన హీరోలపై మరింత ఆసక్తి చూపుతున్నారు. అందుకు కారణం మన హీరోల ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖంగా కనిపిస్తుండడమే.
రామ్‌చరణ్‌కు దక్షిణాదితోపాటు, హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న ఆయన.. అగ్ర దర్శకుడు శంకర్‌కు ఓ మంచి ఎంపిక అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కలయికలో త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. 'ఖైదీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరించిన లోకేష్ కనకరాజ్.. ప్రభాస్ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఈ కలయికలో సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. మరో దర్శకుడు మురుగదాస్.. అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.