Telugu latest movies: శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్‌లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్ ఇండియా ఇమేజ్. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ, తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు హీరోలు. పాన్ ఇండియా సంస్కృతిని ఒంటబట్టించుకుని.. వేల కోట్ల క్లబ్బుల్లో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించగా.. ఇప్పుడీ కిరీటం అందిపుచ్చుకునేందుకు మరికొందరు తెలుగు హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. మరి కొత్తగా ఈ రేసులోకి అడుగు పెడుతున్న ఆ కథానాయకులెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
కొన్నాళ్లుగా తెలుగు కథానాయకుల మనసంతా పాన్ ఇండియా కథల చుట్టూనే తిరుగుతోంది. 'బాహుబలి', 'కేజీఎఫ్' చిత్రాల స్ఫూర్తితో ప్రభాస్, యష్ తరహాలో పాన్ ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కథ కాస్త వైవిధ్యంగా ఉండి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. స్టార్ బలాన్ని దించి.. సాంకేతిక హంగులు జోడించి పాన్ ఇండియా సినిమాగా వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. నలుదిశలా మార్కెట్ విస్తరించే యత్నం చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం అనేక మంది తెలుగు హీరోలు ఈ పాన్ ఇండియా బాటలోనే నడుస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో ఇప్పటికే ఈ ప్రయత్నం చేశారు. ఇటీవలే 'పుష్ప' సినిమాతో కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రయత్నానికి పర భాషల్లోనూ మంచి ఆదరణే దక్కింది. ఉత్తరాది వాసుల్ని ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలోనే దీనికి కొనసాగింపుగా రానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మనసులు దోచుకోవడానికి 'వీరమల్లు'
జయపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు పవన్ కల్యాణ్. ఇప్పుడాయన ‘హరి హర వీరమల్లు’తో తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో పవన్ ఓ గజదొంగగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి తోడుగా మహేశ్
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు హీరో మహేశ్‌బాబు. ఇప్పుడా బాధ్యతను తన భుజాలకు ఎత్తుకోనున్నారు రాజమౌళి. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ఆయన మహేశ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గాండ్రించాలని..!