తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇది మాకు విజయ ఉగాది! - రీతూ వర్మ వార్తలు

చిత్రసీమలో హీరోయిన్లుగా వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న ఈ తెలుగమ్మాయిలు.. ఈసారి ఉగాది పండగ తమకెంతో ప్రత్యేకమని అంటున్నారు. తాము నటించిన సినిమాలు విజయం కావడం వల్ల ఈ ఉగాది ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపారు.

Telugu heroines about ugadi festival
ఇది మాకు విజయ ఉగాది!

By

Published : Apr 13, 2021, 10:59 AM IST

Updated : Apr 13, 2021, 11:29 AM IST

మామిడాకుల తోరణాల మధ్య.. కోయిలరాగాల సన్నాయిల మేళం వినిపిస్తుంటే వేపపూల పరిమళాలు వెదజల్లిన మెత్తటి వసంతంపై.. ఒయ్యారంగా నడిచివచ్చే అందమైన ప్రకృతికన్య ఉగాది. ఈ పండగ మాకు విజయాల్ని తెచ్చిందని మురిసిపోతున్నారు ఇటీవల వెండి తెరమీదకు దూసుకొచ్చిన తెలుగమ్మాయిలు. వారి ఆనందాన్ని పంచుకుందాం రండి.

అదృష్టాన్ని తెచ్చింది..

చాందిని చౌదరి

స్కూలు స్థాయి నుంచే షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించడం మొదలుపెట్టా. ఉగాది పచ్చడిలో చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారం.. షడ్రుచులూ ఉన్నట్లే.. నా ప్రయాణంలోనూ అలాంటి అనుభవాలెన్నో ఉన్నాయి. కానీ ఈ ఉగాది మాత్రం తియ్యటి కానుకను 'కలర్‌ఫొటో' సినిమా విజయం రూపంలో ఇచ్చింది. అందుకే ఈ ఉగాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గతేడాది కాలంగా కొవిడ్‌ పరిస్థితులు.. అందరితోపాటూ నాలోనూ నిర్లిప్తత కలిగించాయి. కానీ ఈ ఉగాదికి ముందు వెండితెరపై నాకు దక్కిన గుర్తింపు.. ఆ బాధను మరచిపోయేలా చేసింది. మాది విశాఖపట్నం. ఉగాది తొలి పండగ కావడం వల్ల ఇంట్లో ఎంతో సందడి ఉండేది. చిన్నప్పుడు పచ్చడిని తినడానికి మాత్రం ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు అందులో బోలెడు పోషకాలున్నాయని తెలిశాక ఇష్టపడటం మొదలుపెట్టా. ఈరోజు అమ్మ చేసే పులిహోర అంటే మాత్రం నాకు ప్రాణం. అంత రుచిగా చేస్తుంది.

- చాందినీ చౌదరి, కథానాయిక

రోజంతా పచ్చడి తింటా!

అంజలి

తెలుగు వాళ్ల తొలిపండగ ఉగాది నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. మా ఇంట్లో చాలా బాగా చేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడం, పూలతో ఇంటిని అలంకరించడం వంటి పనులతో చిన్నప్పుడు సరదాగా గడిచిపోయేది. పండగరోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడంటే నాకు మరింత ఇష్టం. రోజంతా తింటూనే ఉంటా. ఈ ఏడు 'వకీల్‌సాబ్‌' విజయంతో నాకు మరింతగా సంతోషాన్ని తెచ్చిపెట్టింది ఈ పండగ. కరోనా కష్టకాలంలో.. ఇలాంటి హిట్‌ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

- అంజలి, కథానాయిక

మావారితో తొలి పండగ

కయల్​ ఆనంది

ఈ ఏడాది మొదట్లో మనసుకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసిన నాకు ఈ ఉగాది వ్యక్తిగతంగా ప్రత్యేకం. నా భర్త సోక్రటీస్‌తో కలిసి తొలి ఉగాదిని చేసుకుంటున్నా. ఈ ఏడు నేను నటించిన 'జాంబీరెడ్డి' తెలుగమ్మాయిగా నాకో గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతోపాటు తమిళంలో 'కమలి ఫ్రం నడు కావేరి'..కూడా హిట్‌. మావారికి పూజలు, పండగలంటే అంతగా తెలీదు. పండగ వంటకాలు, ఇంటికొచ్చే బంధువులు అంటే మాత్రం సరదా. అందుకే ఈ ఏడాది పండగ మాకిద్దరికీ ప్రత్యేకం. నేను వండే బొబ్బట్లు అంటే లొట్టలేసుకుని తింటారు. చిన్నప్పుడు నానమ్మ ఇంట్లో బంధువులంతా ఉగాదికి కలిసేవాళ్లం. కొత్తబట్టలు, స్నేహితులతో ఆటలు.. ఓ సరదా. ఈ ఏడాది 'శ్రీదేవి సోడా సెంటర్‌' విడుదలకానుంది. తమిళంలో మరో రెండు విడుదలవనున్నాయి.

- కయల్‌ ఆనంది, కథానాయిక

తీపిని పంచింది

అనన్య నాగళ్ల

చిన్నప్పటి నుంచీ నాకు పండగలంటే ఇష్టం. కొత్త బట్టలు వేసుకోవచ్చు. అమ్మచేసే పూర్ణాలను తినొచ్చు. ఈ ఏడు 'వకీల్‌సాబ్‌' చిత్ర విజయం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. 'మల్లేశం' సినిమాతో నటించడం మొదలుపెట్టా. పూర్తిస్థాయిలో ఈ రంగంలో నా అదృష్టం పరీక్షించుకోవాలని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశా. అవకాశాలు వచ్చాయి. అదీ పెద్ద నటులతో. కానీ కరోనా కారణంగా నేను నటించిన చిత్రాలు వాయిదా పడ్డాయి. దాంతో కొంత ఆందోళనకు గురయ్యా. ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. నా విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు అందుకున్న విజయం నన్ను గాల్లో తేలిపోయేలా చేస్తోంది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టి ఈ ఉగాది తీపిని పంచింది. అమ్మ 'వకీల్‌సాబ్‌'లో నా నటన చూసి మురిసిపోయింది. 'భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించావు' అని పవన్‌కల్యాణ్‌ ప్రశంసించారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఉగాది కానుక. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. మాస్క్‌, శానిటైజర్‌ లేకుండా అడుగు బయటకు పెట్టొద్దు.

- అనన్య నాగళ్ల, కథానాయిక

నేనూ తెలుగమ్మాయినే

రీతూ వర్మ

మేం ఉత్తరాది వాళ్లం. అయినా మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నేనూ తెలుగమ్మాయిననే అనుకుంటా. చిన్నప్పుడు ఉగాది పండగ వస్తే చాలు.. నా స్నేహితుల ఇళ్లకు వెళ్లేదాన్ని. వారితో కలిసి ముగ్గులేయడం, గుమ్మాలను పూలతో అలంకరించడం, తోరణాలు కట్టడం వంటివి చేసేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లోనూ ఉగాది చేసుకుంటున్నాం. ఈ పండగకు కరోనా ప్రభావం మనసుకు కష్టంగా ఉన్నా, శర్వానంద్‌, నాగశౌర్య వంటి హీరోలతో కలిసి చేసిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నానీతో నటించిన 'టక్‌ జగదీష్‌' చిత్రం టీజర్‌, పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ పండగ సందర్భంగా ఇవన్నీ నాకు శుభవార్తల్లా అనిపిస్తున్నాయి. అందుకే ఈ ఉగాది నాకు ప్రత్యేకం.

- రీతూవర్మ, కథానాయిక

ఇదీ చూడండి:'ఆర్​ఆర్​ఆర్​' ఉగాది సర్​ప్రైజ్ వచ్చేసింది​!

Last Updated : Apr 13, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details