తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతికే సినిమా సందడి.. ఇప్పటికే బరిలో నాలుగు - సినిమా సంక్రాంతి

కరోనా కల్లోలం చిత్రసీమని అతలాకుతలం చేసింది. ఈ ఏడాది వేసవి వినోదాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. దసరా సరదాలే లేవు. దీపావళికైనా సినీ టపాసులు పేలతాయనుకుంటే అదీ కష్టంగానే ఉంది. ఇక అందరి దృష్టి రాబోయే సంక్రాంతిపైనే. ఆ లోపు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయా? ప్రేక్షకులు థియేటర్లకి ఏ స్థాయిలో వస్తారు? ఇలా చాలా ప్రశ్నలు వేధిస్తున్నా సినీ వర్గాలు మాత్రం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నాయి. వరుసగా విడుదల తేదీల్ని ప్రకటిస్తూ రేసుని షురూ చేశాయి.

Telugu cinema_Sankranthi
సంక్రాంతి రేసులో... సినిమాల సందడి

By

Published : Oct 29, 2020, 7:46 AM IST

2020లో సినీ సందడి అంటే సంక్రాంతినే గుర్తు చేసుకుంటారు సినీ ప్రియులు. ఈ ఏడాది ఆరంభంలోనే 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు బాక్సాఫీసు ముందు భారీ వసూళ్లు కురిపించాయి. భవిష్యత్తుపై కొత్త ఆశల్ని రేకెత్తించాయి. ఆ ఆశలు అడియాశలు అవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు. మార్చి 14కి కరోనాతో థియేటర్లు మూతపడిపోయాయి. ఇప్పుడు మరోసారి సినీ సందడిని తీసుకురావల్సిన బాధ్యత సంక్రాంతిపైనే పడినట్టైంది.

రవితేజ

ఇప్పటికి నాలుగు చిత్రాలు

కరోనా ప్రభావం తగ్గినా, కేంద్ర ప్రభుత్వం థియేటర్లని తెరుచుకోవచ్చని అనుమతులిచ్చినా సినీ వర్గాలు పూర్తి స్థాయిలో హంగామాని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. ప్రేక్షకులు ఇదివరకటిలా థియేటర్లకి వస్తారో రారో? అనే సందేహాలు...యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లలో ప్రదర్శనలు నిర్వహించాల్సి రావడం, అది గిట్టుబాటు అవుతుందో లేదో అనే భయాలతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్ని విడుదల చేయడానికి వెనకంజ వేశారు.

థియేటర్లు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. వచ్చే నెలలో థియేటర్ల తలుపులు తెరుచుకుంటాయనే నమ్మకంతో పరిశ్రమ వర్గాలున్నాయి. ఇక ప్రేక్షకుల్ని థియేటర్లకి లాక్కొచ్చే పెద్ద పండగ సంక్రాంతి ముందుంది కాబట్టి అందరూ అదే భరోసాతో ఉన్నారు. పూర్తయినవి, తుదిదశకు చేరుకున్న వాటిని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఆయా నిర్మాతలు ప్రకటించారు.

రామ్‌ 'రెడ్‌', రానా 'అరణ్య', అఖిల్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్', రవితేజ 'క్రాక్‌' చిత్రాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'వకీల్‌సాబ్'‌ సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. మరి 'వకీల్‌సాబ్‌' వచ్చిందంటే బాక్సాఫీసు దగ్గర మరింత సందడి నెలకొనడం ఖాయం.

అఖిల్
రామ్

అన్ని సినిమాలు సాధ్యమేనా?

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైనా వసూళ్లకి కొదవుండదు. బాగున్నాయంటే ప్రేక్షకులు అన్ని సినిమాల్నీ చూడటానికి ఇష్టపడతారు. కానీ ఈసారి పరిస్థితులు వేరు. అసలే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య ఎక్కువ. దానికితోడు కరోనా ప్రభావం. అప్పటికీ ప్రేక్షకులు యాభై శాతం సీట్లకే పరిమితం అనే నిబంధన కొనసాగిందంటే థియేటర్ల సమస్య మరింత జఠిలమవుతుంది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో థియేటర్లు అవసరం. మరి అన్ని సినిమాలు విడుదలైతే అన్ని థియేటర్లు ఎలా సాధ్యమనేదే ప్రశ్న.

తెలుగు రాష్ట్రాల్లో 1100పైగా థియేటర్లున్నాయి. 500కిపైగా మల్టీప్లెక్స్‌ తెరలున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలంటే వెయ్యికిపైగా థియేటర్లలో విడుదలవుతుంటాయి. గతేడాది సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' తెలుగు రాష్ట్రాల్లో 1200పైగా థియేటర్లలో విడుదలైంది. 'అల వైకుంఠపురములో' వెయ్యికిపైగా థియేటర్లలో విడుదలైంది. మరి వచ్చే సంక్రాంతికి ఒకేసారి అన్ని సినిమాలు విడుదలైతే థియేటర్ల లభ్యత కష్టమవుతుంది. రోజుకి నాలుగు ఆటలు కాకుండా, ప్రదర్శనల సంఖ్యని పెంచినా సమస్య తీరే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సినిమాకి సినిమాకీ మధ్య విరామంతో విడుదలయ్యాయంటే మాత్రం వచ్చే సంక్రాంతి సీజన్‌ సుదీర్ఘంగా సాగే అవకాశాలున్నాయి.

రానా

ఇదీ చదవండి:నటి పునర్నవికి నిశ్చితార్థం అయ్యిందా?

ABOUT THE AUTHOR

...view details