సినిమాకు కథానాయకుడు ఎంత ముఖ్యమో.. ప్రతినాయకుడు అంతే ముఖ్యం. అందుకే హీరోహీరోయిన్ల ఎంపిక పూర్తవ్వగానే విలన్‌పై దృష్టి సారిస్తుంటారు దర్శకనిర్మాతలు. సినిమాలో ఎంత ధీటైన విలన్ ఉంటే అంత బలంగా హీరోయిజం పండుతుందని నమ్ముతుంటారు. హీరోకి సరిసాటిగా కనిపించేలా విలన్‌ని వెతికి పట్టుకొస్తుంటారు. తెరపై స్టైలిష్ విలనిజం హవా మొదలయ్యాక హీరోలు కూడా ఆ పాత్రలపై మొగ్గు చూపుతున్నారంటే ప్రతినాయక పాత్రలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ పాత్రకు తగ్గ నటుల్ని ఎంపిక చేయడం ఇప్పుడు దర్శకులకి కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలు విలన్ల వేటలోనే ఉన్నాయి.
చిరు సినిమాలో ఆయనేనా?
అగ్ర కథానాయకుడు చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో నటించబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రల కోసం అనేక కసరత్తులు జరిగాయి. ఇటీవలే జగపతిబాబు పేరు తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా తెలుగులో ప్రతినాయక పాత్రలకి జగపతిబాబు కేరాఫ్‌గా మారారు.
వాళ్ల కోసం ఎక్కడి నుంచి?
మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కార్ వారి పాట' తెరకెక్కనుంది. అందులో ఓ శక్తివంతమైన ప్రతినాయకుడు కనిపించబోతున్నాడు. ఆ పాత్ర విషయంలోనూ ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిల పేర్లు వినిపించాయి. చిత్ర వర్గాలు మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులోని ప్రతినాయక పాత్ర కోసం కసరత్తులు మొదలైనట్టు సమాచారం. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఓ తెలుగు హీరో పేరు కూడా వినిపించింది. కానీ అందులో వాస్తవం లేదని ప్రకటించేశారు. ఎన్టీఆర్ కోసం విలన్‌ను ఎక్కడి నుంచి వెదుకుతారో!
పాన్ ఇండియా విలన్లు ఎక్కడ?
కొంతకాలంగా తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా సాగుతోంది. పలు భాషలు లక్ష్యంగా రూపొందుతున్న ఆ సినిమాల్లో నటీనటులు జాతీయ స్థాయిలో గుర్తింపున్నవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. మార్కెట్ వ్యూహంలో భాగం అది. సునీల్ శెట్టి, సంజయ్ దత్‌లాంటి వాళ్లు దక్షిణాది సినిమాల్లో నటిస్తుండడానికి కారణం అదే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించే ప్రతి చిత్రం పాన్ ఇండియా లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నదే. ఆయన కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్ల పైచిలుకు వ్యయంతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో విలన్‌గా పాన్ ఇండియా గుర్తింపున్న నటుడే కనిపించబోతున్నారు.
* అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' పాన్ ఇండియా చిత్రమే. ఇప్పటికే ట్యూన్స్‌పై కసరత్తు పూర్తిచేసిన చిత్రబృందం.. పలు భాషల్లో గుర్తింపున్న నటుల్ని ఎంపిక చేయడంపై దృష్టి పెట్టింది. విజయ్ సేతుపతితోపాటు, సునీల్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి.
* సినిమాని పట్టాలెక్కించే సమయానికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లని సంప్రదించి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందాలు ఉన్నాయి. విలన్ పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని, అందుకు తగ్గ నటుల ఎంపిక కోసం చిత్రబృందాలు ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నాయి.
బాలయ్య కోసం ఇద్దరు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బోయపాటి సినిమాల్లో విలనిజానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ క్రమంలో తెరపై పలువురు విలన్లు కనిపిస్తుంటారు. తదుపరి చిత్రంలోనూ ఇద్దరు శక్తివంతమైన ప్రధాన విలన్లు కనిపించబోతున్నారట. అందుకోసం ఇప్పటికే ఒకరిని ఎంపిక చేశారు. మరో పాత్ర కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ పేరు వినిపించింది.