పడిలేచిన కెరటం నితిన్. ఆరంభంలోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోలతో సమాన స్థాయి క్రేజ్ వచ్చింది. అగ్ర దర్శకులందరితోనూ కలిసి సినిమాలు చేశాడు. అలాంటి నటుడు వరుసగా డజనుకి పైగా సినిమాలతో వరుస పరాజయాల్ని చవిచూస్తాడని ఎవరైనా ఊహిస్తారా? నితిన్ విషయంలో అదే జరిగింది.
ఇష్క్‌తో మళ్లీ
ఇక అందరూ నితిన్ పనైపోయిందని మాట్లాడుకున్నారు. కానీ నితిన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం పోరాటం చేశాడు. పరాజయాలు ఎదురైన కొద్దీ మరింత కసితో పనిచేశాడు. అదే ఆయన్ని మళ్లీ నిలబెట్టింది. 'ఇష్క్'తో ఎట్టకేలకి ఆయన తన ఖాతాలో మరో విజయం సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి ఆయన మళ్లీ విజయాల పరంపర కొనసాగిస్తూ వస్తున్నాడు. 'గుండె జారి గల్లంతయ్యిందే', 'అఆ' చిత్రాలు నితిన్‌ను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఈ మధ్యే వచ్చిన 'భీష్మ' మంచి విజయాన్ని సాధించగా.. ప్రస్తుతం 'రంగ్‌దే' సినిమాతో బిజీగా ఉన్నాడు నితిన్.
'తొలిప్రేమ' చూసి అలా..
యువతరంలో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న కథానాయకుల్లో నితిన్ ఒకడు. ఆయన 1983 మార్చి 30న జన్మించాడు. తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా పంపిణీదారుడు కావడం వల్ల ఇంట్లో సినీ వాతావరణమే ఉండేదట. నచ్చిన సినిమాని కనీసం రెండు మూడు సార్లైనా చూసేవాడట. పవన్‌కల్యాణ్ 'తొలిప్రేమ' చిత్రాన్ని చూశాకే కథానాయకుడు కావాలనే కోరిక పుట్టిందని చెబుతుంటాడు నితిన్. ఆ చిత్రాన్ని థియేటర్లో 28 సార్లు చూశాడట. తనలో మొదట కథానాయకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది కూడా 'తొలిప్రేమ' తీసిన దర్శకుడు కరుణాకరన్ వల్లేనట.
"కరుణాకరన్ మా నాన్నకి స్నేహితుడు. దాంతో తరచుగా ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు నన్ను చూసి స్మార్ట్‌గా ఉన్నావు, నిన్ను పెట్టి సినిమా తీస్తా" అన్నారని నితిన్ గుర్తు చేసుకుంటుంటాడు. ఆయన సరదాగా అన్నాడనిపించినా... నితిన్ మనసులో నిజంగానే హీరో అయితే బాగుంటుందేమో అనే కోరిక కలిగిందట.
'జయం'తో మొదలు