రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి
16:32 June 08
రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి
రాష్ట్రంలో సినిమా, సీరియళ్ల షూటింగులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సినిమా, టీవీ కార్యక్రమాలకు అనుమతినిస్తూ ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. లాక్ డౌన్ కారణంగా రెండున్నర నెలలుగా రాష్ట్రంలో షూటింగులు నిలిచి పోయాయి. పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపడంతో.. షూటింగులకు అనుమతివ్వాలని సినీ, టీవీ రంగ ప్రముఖులు ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి కోరారు. సినిమా, టీవీ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులను అనుమతివ్వడంతో పాటు థియేటర్లను తెరవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులతో సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. పరిమిత సిబ్బందితో, కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీంతో కొవిడ్ మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సిబ్బందితో రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి.. రాష్ట్రంలో సినిమా థియేటర్లకు మాత్రం ఇప్పుడే అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.