"ఓ సినిమా చేసేటప్పుడు(shivani rajasekhar new movie) మంచి కథ ఉందా.. అందులో నా పాత్ర బాగుందా? అని చూస్తానే తప్ప..బడ్జెట్లు, పారితోషికాలు అసలు పట్టించుకోను" అంటోంది శివాని రాజశేఖర్. కథానాయకుడు రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని. ఇప్పుడు 'అద్భుతం' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. తేజ సజ్జా(adbhutham movie teja sajja) హీరోగా నటించిన ఈ సినిమాను.. మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ఇది ఈనెల 19న(adbhutam movie 2021 release date) ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలిపింది శివాని.
"స్టార్ కిడ్స్‌కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు. మిగతా వాళ్ల విషయమేమో కానీ, నేను.. నా చెల్లి శివాత్మిక చాలా ఒడుదొడుకులు దాటుకొనే తెరపైకి వచ్చాం. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో పరిశ్రమలో తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం. అదొక్కటే మాకుండే సానుకూలాంశం. అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో అందరిలాగే కష్టపడి నిరూపించుకోక తప్పదు. నేను.. శివాత్మిక చాలా సినిమాలకు ఆడిషన్లు ఇచ్చాం. ఎన్నోసార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నాం. అలాంటి ఎన్నో సవాళ్లను దాటుకొనే ఇప్పుడు నా 'అద్భుతం' ప్రేక్షకుల ముందుకొస్తుంది".
"నిజానికి ఇది నా మూడో చిత్రం. తెలుగులో నేను సంతకం చేసిన తొలి సినిమా 'టూ స్టేట్స్' రీమేక్. చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా చేశా. అదీ అనుకోకుండా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఆ సమయంలోనే 'అద్భుతం'(adbhutam movie director) నా చేతికొచ్చింది. ఇది ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది. 'కల్కి' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాకీ కథ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చి.. చేస్తానన్నా. తర్వాత దర్శకుడు మల్లిక్ రామ్‌ను అడగ్గా.. చిన్న ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు. నేనిందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తా. నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్రిది".