"నేను ఏ సినిమా చేసినా కథ కథనాలు కొత్తగా, ఆసక్తికరంగా.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగేలా ఉండాలనుకుంటాను. అలాంటి అంశాలన్నీ 'అద్భుతం'లో పుష్కలంగా ఉన్నాయి" అని హీరో తేజ సజ్జా అన్నారు. 'జాంబిరెడ్డి', 'ఇష్క్' సినిమాల తర్వాత తేజ నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. మల్లిక్ రామ్ తెరకెక్కించారు. శివాని రాజశేఖర్ హీరోయిన్. శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే గురువారం విలేకర్లతో చిత్ర విశేషాలు చెప్పారు తేజ సజ్జా.
* ఈ ఏడాది నా నుంచి వస్తున్న మూడో చిత్రమిది. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్ల క్రితం దర్శకుడు ప్రశాంత్ వర్మ నాకీ కథాలోచన చెప్పాడు. వినగానే.. స్టోరీ లైన్ భలే ఉందనిపించింది. నిజానికి అప్పటికి ఈ కథ నేను చేస్తానని అనుకోలేదు. తను సరదాగా చెప్పాడంతే. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ దర్శకుడు మల్లిక్ రామ్ చేతికి వెళ్లడం.. నేను చేయాలనుకోవడం.. చంద్రశేఖర్ సర్ నిర్మించేందుకు ముందుకు రావడం.. చకచకా జరిగిపోయాయి. నిజానికి ఈ చిత్రాన్ని తొలుత సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అదే సమయంలో ఆ బ్యానర్‌లోనే నాకు 'ఓ బేబీ' చేసే అవకాశం దొరికింది. దీంతో ముందు ఆ సినిమా పూర్తి చేసి.. తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాం.
అద్భుతం మూవీలో తేజ-శివాని * నేనిందులో సూర్య అనే పాత్రలో కనిపిస్తాను. వెన్నెలగా శివాని కనిపిస్తుంది. ట్రైలర్‌లో చూపించినట్లు.. సినిమాలో మేమిద్దరం ఒకే ఫోన్ నంబర్‌తో కనెక్ట్ అవుతాం. మరిలా ఇద్దరికీ ఒకే నంబర్ ఎందుకుంది? మేము కలిశాక.. మా ఇద్దరికీ ఎదురైన సవాళ్లేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాం? అన్నది చిత్ర కథ. చాలా ఆసక్తికరమైన మలుపులు, ట్విస్ట్‌లతో నిండిన చిత్రమిది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్సులు ఏమీ ఉండవు. కథలో భాగంగా చక్కటి వినోదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కథ ఎక్కువ మందికి చేరవవ్వాలంటే.. ఓటీటీనే మంచి మార్గమని మా అందరికీ అనిపించింది.
* నా దృష్టిలో రిస్క్ చేయకపోవడమే అతి పెద్ద రిస్క్. మాలాంటి కొత్త హీరోల చిత్రాలకు ప్రేక్షకులు రావాలంటే.. కథలో ఓ ఆకర్షించే కొత్త అంశం తప్పకుండా ఉండాలి. కాబట్టి ప్రతి సినిమాకూ ఓ సరికొత్త కథతో ప్రయోగం చేయక తప్పదు. అయితే కొన్నిసార్లు ఈ ప్రయోగాలు ఊహించనంత విజయాల్ని అందించొచ్చు.. లేదంటే చేదు ఫలితాల్ని రుచి చూపించొచ్చు. ఫలితమేదైనా సరే.. నేనెప్పుడూ సినిమా కోసం ఆఖరి నిమిషం వరకు శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉంటా. ప్రస్తుతం నేను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను-మాన్' సినిమా చేస్తున్నా. పక్కా కమర్షియల్ చిత్రమిది. మంచి విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. 'జాంబిరెడ్డి'కి సీక్వెల్ పక్కాగా వస్తుంది.