తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేనూ.. అంజ‌లా జ‌వేరి ఇరవ‌య్యేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాం' - ఖైదీ నెంబర్ 150

'ఖైదీ నంబర్ 150' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్లైలిష్​ విలన్ తరుణ్ అరోరా. శుక్రవారం విడుదలైన 'అర్జున్ సురవరం' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అరోరా పలు విషయాలను పంచుకున్నాడు.

tarun arora
తరుణ్ అరోరా

By

Published : Dec 3, 2019, 7:40 AM IST

స్టైలిష్ విల‌న్‌గా తెలుగు తెర‌పై మెరుస్తున్న మ‌రో న‌టుడు.. త‌రుణ్ రాజ్ అరోరా. 'ఖైదీ నంబ‌ర్ 150' త‌ర్వాత మ‌ళ్లీ 'అర్జున్ సుర‌వ‌రం'లో ప్ర‌తినాయ‌కుడిగా అల‌రించాడు. క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన అంజ‌లా జ‌వేరి భ‌ర్తే త‌రుణ్ అరోరా. ఇటీవ‌ల 'అర్జున్ సుర‌వ‌రం' విడుద‌లైన సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యాడీ నటుడు. ఆ విష‌యాలివీ..

స్టైలిష్ విల‌న్ పాత్ర‌ల‌కి మీరు కేరాఫ్‌గా నిలుస్తున్నారు..

స్వ‌త‌హాగా నేను మోడ‌ల్‌ని. దాంతో ప్ర‌తి సినిమాలోనూ నా లుక్ స్టైలిష్‌గా క‌నిపిస్తుంటుంది. అది న‌ట‌న‌లోనూ క‌నిపించేలా చూసుకోవ‌డ‌మే స‌వాల్‌. ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంత‌మ‌య్యాన‌నే సంతృప్తి ఉంది.

తరుణ్ అరోరా

'అర్జున్ సుర‌వ‌రం'లో పాత్ర‌కి ఎలాంటి స్పంద‌న ల‌భించింది..?

చాలా మంచి పాత్ర‌. త‌మిళ చిత్రం 'కణిత‌న్‌'కి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. మాతృక‌లో కూడా నేనే న‌టించా. అక్క‌డ క‌థ ప్ర‌ధానంగా హీరో, విల‌న్‌ల మ‌ధ్యే సాగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇత‌ర పాత్ర‌ల‌కి కూడా ప్రాధాన్యం ద‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకు మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా మెచ్చుకుంటున్నారు.

తరుణ్ అరోరా

ద‌క్షిణాదిలో న‌టిస్తున్నప్పుడు భాష ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి..?

న‌ట‌న అనేది భాష‌కి సంబంధించిన విష‌యం కాదు. భావం ముఖ్యం. ఎక్క‌డైనా భావాలు, భావోద్వేగాలు ఒకే ర‌కంగా ఉంటాయి. అయితే హిందీలో నా సంభాష‌ణ‌ల్ని ఒక గంట ముందు చెబితే స‌రిపోతుంది, ఇక్క‌డైతే ఇంకొంచెం ముందు చెబుతుంటారు. కాక‌పోతే భాష‌ల‌తోనూ, ప్రాంతాల‌తోనూ నాకున్న అనుబంధం ప్ర‌త్యేకంగా ఉంటుంది. నేను అస్సోంలో పుట్టా. చ‌దువుల కోస‌మ‌ని చెన్నై వ‌చ్చా. బెంగళూరులో మోడ‌ల్‌గా కొన‌సాగా. హిందీ చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డం వల్ల ముంబయి వెళ్లా. అక్క‌డ్నుంచి ఇప్పుడు మ‌ళ్లీ ద‌క్షిణాదికి వ‌చ్చా. ఎక్క‌డికి వెళ్లినా నువ్వు అక్క‌డివాడివి క‌దా అంటుంటారు. అయితే ఇప్పుడు చాలామంది న‌న్ను సౌత్ విల‌న్ అని పిలుస్తుంటారు. ఈ గుర్తింపుని ఆస్వాదిస్తున్నా.

తరుణ్ అరోరా

మీ భార్య అంజ‌లా జ‌వేరి ఏమైనా స‌ల‌హాలు ఇస్తుంటారా..?

త‌ను న‌ట‌న గురించి నాకెప్పుడూ ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వ‌దు. నీకు న‌చ్చింది చేయ్ అంటుంది. ఇప్పుడు నా పనితీరు చూసి త‌ను సంతోషిస్తుంటుంది. మాది ప్రేమ‌వివాహ‌మే. మాది ఇర‌వ‌య్యేళ్ల ప్రేమ‌బంధం. ఆరేళ్ల కింద‌ట మా కుటుంబ స‌భ్యుల కోసం పెళ్లి చేసుకున్నాం. నేనైనా, అంజ‌లా జ‌వేరి అయినా పేప‌ర్ల‌లో రాసుకుంటేనే పెళ్లి జ‌రిగిన‌ట్లుగా ఎప్పుడూ భావించ‌లేదు. మ‌నసుల్లో ప్రేమ ఉండాలి. అలాంటి బంధం ఎప్ప‌టికీ ధృడంగా ఉంటుంది. మొద‌ట త‌న ముందు నేనే ప్రేమ‌ని వ్య‌క్తం చేశా. అప్పుడు త‌ను ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడ‌ల్‌గా ఉన్నా. ఒక ఈవెంట్‌లో క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి. మాకు పిల్ల‌లు లేరు. మేమే ఒక‌రికొక‌రు పిల్ల‌ల్లాగా ఉంటాం. పెద్ద‌లు కుదిర్చిన బంధంలో పెళ్లి త‌ర్వాత భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌రింత ప్రేమ పుట్టేందుకు పిల్ల‌లొస్తుంటారు. కానీ మేం మాత్రం ముందు నుంచే ప్రేమ‌లో ఉన్నాం.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' త‌ర్వాత అంజ‌లా జ‌వేరి తెలుగులో న‌టించ‌లేదు. తెలుగులో మ‌ళ్లీ న‌టించేందుకు ప్ర‌య‌త్నాలేమైనా చేస్తున్నారా..?

మంచి క‌థ కోసం ఎదురు చూస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌స్తుతం చాలా మంది యువ క‌థానాయిక‌లు ఉన్నారు. ఈ ద‌శ‌లో త‌న‌కి త‌గ్గ క‌థ, పాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇవీ చూడండి.. సంక్రాంతి కంటే ముందే నాలుగు స్తంభాలాట

ABOUT THE AUTHOR

...view details