బాలీవుడ్ సినిమా 'మిషన్ మంగళ్' ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది హీరోయిన్ తాప్సీ. విభిన్న బయోపిక్‌లతో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ కథానాయిక... దివంగత భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ జీవిత చరిత్రలోనూ నటించాలని ఉందని చెప్పింది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి మృతికి సంతాపం తెలిపిన తాప్సీ... ఆమెకు సంబంధించిన అంశంపై మాట్లాడింది.
"సుష్మాజీ అంటే నాకు చాలా ఇష్టమే కాదు విపరీతమైన గౌరవం. అలాంటి వ్యక్తి బయోపిక్ తీస్తే కచ్చితంగా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. స్త్రీ అంటే ఆమెలాగ ఉండాలి. అందుకే అలాంటి గొప్ప రాజకీయ నాయకురాలి పాత్రను ఎవరూ వదులుకోరు. భారతీయ కట్టుబొట్టుకు నిలువెత్తు నిదర్శనం సుష్మ. ఆ లెజెండరీ నాయకురాలి జీవితంపై సినిమా తీయాలనుకునే నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా." -తాప్సీ, సినీ నటి.