తనీశ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మరో ప్రస్థానం'(maroprasthanam tanish). 'జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్'.. అనేది ఉప శీర్షిక. గురువారం(సెప్టెంబరు 16) ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 'ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు' అని విలన్ పాత్ర చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. 'అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది' అంటూ తనీశ్ తన పాత్రను వివరించిన తీరు బాగుంది. 'అతి చిన్న కెమెరాతో సింగిల్ షాట్‌లో తెరకెక్కించిన తొలి సినిమా ఇదే' అని చిత్రబృందం తెలిపింది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథకు జానీ దర్శకుడు. ముస్కాన్ సేథీ నాయిక. భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రధారులు. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
'పలాస' హీరో రక్షిత్ నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ సహా ఓ ప్రత్యేక వీడియో విడుదలైంది. చిత్రానికి 'శశివదనే' అనే పేరును ఖరారు చేశారు. ఇందులో ప్రేమ గురించి రక్షిత్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బెన దర్శకుడిగా, అహితేజ బెల్లంకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.