తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tanikella Bharani: రంగస్థలం నుంచి రంగుల ప్రపంచం దాకా

నటుడితో పాటు, రచయిత, గాయకుడు, తాత్వికుడు ఇలా అనేక కోణాలు కలిగిన వ్యక్తి తనికెళ్ల భరణి. పాత్ర ఏదైనా అక్కడ మనకు కనిపించేది భరణి కాదు.. ఆ పాత్ర ప్రతిరూపమే. అంతలా మనల్ని ఆయన నటనతో మాయచేస్తారు. నేడు తనికెళ్ల భరణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవీతంపైనా ఓ లుక్కేద్దాం.

Tanikella Bharani
తనికెళ్ల భరణి

By

Published : Jul 14, 2021, 5:32 AM IST

తెలుగు సినిమాను 'శివ' ముందు, 'శివ' తరువాత అనే విభజన రేఖతో విశ్లేషించవచ్చంటారు. అప్పట్లో 'శివ' సృష్టించిన సంచలనం చరిత్రలో నిలిచిపోయింది. తక్కువ డైలాగులతో, మనం రోజూ చూసే పాత్రలతో 'శివ' కొత్త తరహా నిర్మాణానికి దారి చూపింది. ఆ సినిమా ద్వారా ప్రతిభావంతులెందరో తెరకు పరిచయమై.. అనంతర కాలంలో ఓ వెలుగు వెలిగారు. అంతకు ముందే సినిమాకు పరిచయమైనా.. 'శివ'లోని నానాజీ పాత్ర ద్వారా గుర్తింపు పొందిన కళాకారుడు తనికెళ్ల భరణి. ఆయన పేరు శివతోనే ముడిపడి ఉంది. కారణం.. ఆయన శివ భక్తుడు. ఆటగదరా శివా...! అంటూ ఆ గరళకంఠుడిని నోరారా కీర్తించినవారు. అందుకే... నాటి 'శివ' నుంచి నేటి 'ఆటగదరా శివా'...! వరకూ సాగిన ఆయన సృజనాత్మక ప్రస్థానం అభినందనీయం. ఆయనలో ఓ అక్షర శిల్పి... రంగస్థల, వెండితెర నటుడు, కవి, గాయకుడు... ఇలా బహుముఖ ప్రతిభ దాగుంది.

రంగస్థలం నుంచి రంగుల ప్రపంచం దాకా...!

తొలుత ఆయన రంగస్థల రచయిత. సాహితీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. ఇంటర్మీడియెట్‌ వరకూ ఏ రచన చేయలేదు. తప్పని పరిస్థితుల్లో కళాశాలలో ఓ నాటకం ప్రదర్శించాల్సి వచ్చింది. అప్పుడే ఆయనలో రచయిత బయటపడ్డారు. అద్దెకొంప పేరుతో ఆయన రాసిన నాటకానికి సహచర విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఆ నాటకం మొదటి బహుమతిని అందుకుంది. ఆ తర్వాత మిత్రులు దేవరకొండ నరసింహ ప్రసాద్‌ ప్రోత్సాహంతో రాసిన అగ్గిపుల్ల ఆత్మహత్య కవిత పత్రికలో చోటు సంపాదించింది. బి.కామ్‌ చదువుతుండగా రాళ్లపల్లి పరిచయం.. స్నేహంగా మారి ఆయన్ని నాటక కళ పట్ల ఇష్టాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపకరించింది. అంతే కాదు, రాళ్లపల్లి రాసిన 'ముగింపు లేని కథ' నాటకంలో తనికెళ్ల భరణి డెబ్బయి ఏళ్ల వృద్ధుడి పాత్రని రంగస్థలంపై పండించారు.

ఆ నాటకం విజయవంతమైన తర్వాత తనికెళ్ల భరణి పేరు వివిధ నాటక సంస్థల్లో ప్రచారంలోకి వచ్చింది. రాళ్లపల్లి చెన్నై వెళ్లిపోవడం వల్ల ఆయన నిర్వహిస్తున్న శ్రీ మురళీ కళానిలయం సంస్థకు రచయిత కొరత ఏర్పడింది. తనికెళ్ల భరణి ఆ కొరతను తీరుస్తూ ఆ నాటక సంస్థ కోసం 10 నాటకాలు రచించారు. వాటికి తల్లావజ్జుల సుందరం దర్శకత్వం వహించారు. స్త్రీ వాదాన్ని బలపరుస్తూ భరణి రాసిన గోగ్రహణం నాటకం సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది.

సినిమా రచయితగా భరణి

తనికెళ్ల భరణి రాసిన 'చల్‌ చల్‌ గుర్రం' నాటకం ఆయన చలన చిత్ర ప్రవేశానికి ఊతమిచ్చింది. ఆ నాటకాన్ని చూసిన రాళ్లపల్లి.. వంశీకి, భరణి పరిచయమయ్యేలా చేశారు. దాంతో.. భరణికి 'కంచు కవచం' చిత్రానికి పనిచేసే అవకాశం దక్కింది. ఆ చిత్రానికి సంభాషణలు సమకూర్చడమే కాకుండా.. నటుడిగా ఓ వేషం కూడా వేశారు. అనంతరం వరుసగా సినీ అవకాశాల్ని ఆయన దక్కించుకున్నారు. ఆయన రాసిన చిత్రాల్లో 'లేడీస్‌ టైలర్‌' బాగా గుర్తింపు తెచ్చింది. 'ఆలాపన', 'కనక మహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌', 'లాయర్‌ సుహాసిని', 'సంకీర్తన', 'వారసుడొచ్చాడు', 'మహర్షి', 'వెన్నెల్లో ఆడపిల్ల', 'శారదాంబ', 'చిన్నారి స్నేహం', ఇలా చాలా చిత్రాలకు కలం బలం అందించారు. తెలంగాణ మాండలికంలో మాటలు రాయడంలో భరణి సిద్ధహస్తుడు. 'మొండి మొగుడు పెంకి పెళ్ళాం' చిత్రంలో నాయిక విజయశాంతి పాత్రకు తెలంగాణ యాసలో మాటలు రాసి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక నటుడిగా కూడా తన ప్రతిభ చూపించారు. 'లేడీస్‌ టైలర్‌', 'కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌', 'చెట్టుకింద ప్లీడర్‌', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'సీతారామయ్య గారి మనవరాలు', 'మనీ', 'గాయం', 'మాయాబజార్‌', 'దెయ్యం', ఇలా చాలా సినిమాల్లో నటించారు. కమెడియన్‌గా, విలన్‌గానూ ఆయన వైవిద్యం చూపించారు.

కుటుంబ నేపథ్యం

తనికెళ్ల భరణి తండ్రి తనికెళ్ల సేతు రామలింగేశ్వరరావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. 1954 జులై 14న ఆంధ్రప్రదేశ్‌ నాగులపల్లిలో భరణి పుట్టారు. ఆయనకు దుర్గ భవానితో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు. పేరు మహా తేజ. ఒక కూతురు సౌందర్య లహరి.

నంది అవార్డులు

'సముద్రం' సినిమాలో ఉత్తమ విలన్‌గా, 'నువ్వూ నేను' సినిమాలో ఉత్తమ సహాయనటుడిగా, 'మిథునం' సినిమాకు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు భరణి. 'మిథునం' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సినిమా అవార్డు వరించింది.

తెలుగు సినిమాలో 25 సంవత్సరాలపాటు సృజనాత్మక సేవలు అందించినందుకు సంగం సంస్థ అవార్డుతో తనికెళ్ల భరణిని సత్కరించింది.

సాహితీ పురస్కారాలు

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహితీ అవార్డు, భానుమతి అవార్డు, శ్రీ వానమామలై వరదాచార్యులు సాహితీ పురస్కారం, కావలిలోని జవహర్‌ భారతి సంస్థ పురస్కారం, అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు, అక్కినేని స్వర్ణ కంకణం, నెల్లూరు నాగబైరవ కోటేశ్వరరావు సాహితీ పురస్కారం... ఇలా అనేక పురస్కారాలు తనికెళ్ల భరణి అందుకున్నారు. 'ఆటగదరా శివా.. ఆటగదరా కేశవా' అంటూ ఆలపించిన భరణి 'నాలోన శివుడు కలడు... నీలోన శివుడు కలడు... నాలోన కల శివుడు నీలోన కల శివుడు లోకమ్ము నేలగలడు... కోరితే శోకము బాప గలడు...' అంటూ ఆధ్యాత్మిక సందేశాలూ ఇస్తున్నారు.

ఇదీ చదవండి :'రాధేశ్యామ్'​ అరుదైన రికార్డు.. తొలి చిత్రం ఇదే!

ABOUT THE AUTHOR

...view details