ప్రస్తుతం తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం, తమిళ నటుడు ఇళయ దళపతి విజయ్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. విజయ్ ఓటువేసే క్రమంలో ఆయన ఫొటోలను తీయడానికి మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొంది. దీంతో పోలింగ్ బూత్ ప్రాంగణంలో ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన నటుడు విజయ్ వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా మంది దళపతి అభిమానులు పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అభిమానుల సంఘం "తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం" (TVMI) జెండా, పేరును ఉపయోగించడానికి అభిమానులు నటుడి అనుమతిని కోరగా.. ఆయన కూడా అందుకు అంగీకరించారు. మరోవైపు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ "ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం" అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. అందులో ఆయన జనరల్ సెక్రటరీగా, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. అయితే విజయ్ తన పేరును రాజకీయ అజెండాలో ఉపయోగించుకున్నందుకు గతంలో ఆయన తల్లిదండ్రులపై కేసు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. విజయ్ తన పేరుపై ఉన్న తండ్రి పార్టీని రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.