కరోనా లాక్డౌన్తో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపై భారీ ప్రభావం పడింది. దీంతో ఇండస్ట్రీపైనే ఆధారపడిన చాలామంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సినీ దర్శకుడు ఆనంద్.. తన కుటుంబ పోషణ కోసం కిరాణా దుకాణం ప్రారంభించారు. ఇప్పటివరకు తాను పోగు చేసుకున్న డబ్బుతో.. స్నేహితుడి భవనంలో చిన్న గదిని అద్దెకు తీసుకొని షాప్ తెరిచినట్లు చెప్పారు. ప్రస్తుతం చెన్నైలోని మౌలివాక్కంలో దీనిని నడుపుతున్నారు.
పదేళ్లకుపైగా తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న ఆనంద్.. దేశంలో సినిమా థియేటర్లు వచ్చే ఏడాది వరకు మూసివేసే ఉంటాయని అభిప్రాయపడ్డారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే తిరిగి సినిమాల్లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
"లాక్డౌన్ సమయంలో నేను ఇంటికే పరిమితమయ్యా. తమిళనాడులో కిరాణా షాపులను మాత్రమే తెరవడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలుసుకొని.. నేనూ ఓ దుకాణాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇందులో భాగంగా నూనె, పప్పుధాన్యాలు, బియ్యం ఇలా అన్ని రకాల నిత్యవసర సరకులను తక్కువ ధరకే అమ్ముతున్నా. ఇలా చేయడం వల్ల కొనుగోలుదారులు పెరుగుతారని నా నమ్మకం. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నా"