తమిళ స్టార్ హీరో విక్రమ్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంది. ఈ పాత్రను పోషించేది వీరే అంటూ పలువురు తమిళ కథానాయకుల పేర్లు, టాలీవుడ్ యంగ్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం వల్ల అవన్నీ అవాస్తవం అని తేలింది.
తాజాగా తమిళ నటుడు విక్రమ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలోని ఆ ముఖ్య పాత్రకు విక్రమ్ అయితేనే న్యాయం చేయగలడని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిందని తెలిసింది. మరి విక్రమ్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడా? బన్నీతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నాడా? అసలు ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.