తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమే: తమన్నా - తమన్నా ఇష్టమైన హీరో

నాలుగు భాషల్లో కథానాయిక, ప్రత్యేక గీతాల్లోనూ ఉర్రూతలూగిస్తున్న తమన్నా వెబ్‌ సిరీసుల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పుడు టీవీ రంగంలోనూ కాలుమోపుతోన్న తమన్నా వసుంధరతో ప్రత్యేకంగా మాట్లాడింది.. తన ఆలోచనలను పంచుకుంది.

Tamannah
తమన్నా

By

Published : Aug 11, 2021, 9:54 AM IST

పదిహేనేళ్లకే తెరంగేట్రం చేసి, ప్రముఖ హీరోల సరసన జోడీ కట్టి... ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్న నటి సింధీ సుందరి తమన్నా. త్వరలో 'ఎఫ్‌3', 'మ్యాస్ట్రో', 'సీటీమార్‌', 'దటీజ్‌ మహాలక్ష్మి' వంటి సినిమాల్లో కనిపించబోతున్న ఈ మిల్కీబ్యూటీని 'వసుంధర' పలకరించగా తన ఇష్టాయిష్టాల గురించి చెబుతోందిలా..

తెలుగమ్మాయినే: దక్షిణ భారతీయ భాషలన్నింటిలో చేసినా నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు సినిమాలే. అందుకేనేమో ప్రపంచమంతా నన్ను తెలుగు అమ్మాయిగానే గుర్తిస్తారు.

స్ఫూర్తి: మాధురి దీక్షిత్‌ని చూసి సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ స్ఫూర్తి రంగంలో అడుగుపెట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆపై మనకు మనమే ప్రేరణ పొందాలి. నేను చేసే సినిమాల్లోని పాత్రల ద్వారానే స్ఫూర్తి పొందుతూ వచ్చాను.

వైవిధ్య ప్రయాణం: బహుభాషల్లో చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, ఫిట్‌నెస్‌ వీడియోలు, ఇప్పుడు టీవీ షో... ఏదీ ప్రణాళిక వేసుకుని చేయను. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటా. సినిమాల్లోనూ ఇంత దూరం వస్తానని అనుకోలేదు. సీనియర్లతో పాటు యువ నటులతోనూ చేస్తున్నా. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి.. దానికి అనుగుణంగా కొత్త వేదికల్లో అడుగుపెట్టా. కానీ ఏ రంగంలోనైనా వైవిధ్యం ఉండేలా చూసుకుంటా.

పదేళ్ల తర్వాత: 16ఏళ్లకు ముందు ఇలా ఉంటానని ఊహించలేదు. అవకాశాలు వచ్చాయి. అలానే ఏ రంగంలోనైనా మనసు పెట్టి పని చేస్తే అదే మనల్ని అక్కున చేర్చుకుంటుంది.

తెలుగు వంటలు: మా ఇంట్లో అందరికీ పూత రేకులు, ఆవకాయ అంటే చాలా ఇష్టం. ముంబయిలో మా స్నేహితులను కలిసేందుకు వెళ్తే హైదరాబాద్‌ బిర్యానీ తీసుకెళ్తా. అది వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇప్పుడీ మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమం వల్ల మరెన్నో ప్రాంతీయ వంటకాలపై ఇష్టం పెంచుకున్నా.

ఎంచుకునే ఛాన్స్‌: ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనిదే జీవితం. సినిమాలు కూడా నేను ఎంచుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. సినిమాల్లోకి వస్తానని, రాణిస్తానని ఊహించనే లేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం సాధించినట్లే.

పుస్తకమా!: ఆనందం, బాధ.. ఇలా నన్ను కదిలించిన సందర్భాలు ఎదురైనప్పుడు, సమయం దొరికితే కవితలు రాస్తుంటా. ఇప్పటి వరకు ఎన్ని రాశానో లెక్క పెట్టలేదు. పుస్తక రూపం ఇవ్వాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదు.

ఇక ముందూ సేవ: లాక్‌డౌన్‌లో రోజుకు ఒక పూట కూడా తిండి దొరకని వారెందరినో చూశా. అటువంటి నిరుపేదలకు సాయం చేయాలని ‘లెట్స్‌ ఆల్‌ హెల్ప్‌’ స్వచ్ఛంద సంస్థతో పని చేశా. నా పరిచయాలతో పది మందికి సాయం అందించాలని చేసిన ప్రయత్నం వేల మందికి మేలు చేసింది. ఇక ముందూ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తా. దాతృత్వం ఉన్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు.

అమ్మనాన్నలతో

అమ్మానాన్నల ముద్దుల కూతురు

లాక్‌డౌన్‌.. నాకెంతో నేర్పింది. ఇంట్లో వాళ్లతో ఇంతకాలం ఎప్పుడూ గడపలేదు. ఆ అవకాశం లాక్‌డౌన్‌ వల్ల వచ్చింది. అమ్మానాన్నలతో గడపటం వల్ల మా మూలాలేమిటో తెలుసుకునే సమయం దొరికింది. వంటలతో మన సంస్కృతి ఏమిటో తెలుస్తోంది. మా అమ్మమ్మ లేకున్నా ఆమె చేసిన వంటల గురించి అమ్మ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. మన సంప్రదాయాలను రోజూ గుర్తు చేసేవే వంటలు. మాస్టర్‌ చెఫ్‌ వల్ల వంటలపై మరింత పరిశోధన చేసే అవకాశం దక్కింది.

కరోనా: నేను మామూలుగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉంటా. కానీ కరోనా ఎవరినీ విడిచిపెట్టదు కదా. నాకూ వచ్చింది. పౌష్టికాహారం, మానసిక దృఢత్వం నేను త్వరగా కోలుకునేలా చేశాయి. ఆహారం, శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం నేర్పింది. తగ్గింది కదా అనుకుని అశ్రద్ధ చేయకండి. ప్రతి ఒక్కరూ విధిగా అన్ని జాగ్రత్తలనూ పాటించండి.

అన్నయ్యతో

అన్న కాదు మార్గదర్శి: మా అన్నయ్య ఆనంద్‌ డాక్టర్‌. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. నా జీవితంలో తనది ప్రత్యేక స్థానం. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తొలి ఫోను వెళ్లేది ఆనంద్‌కే. కరోనా వచ్చిందని తెలియగానే ఆనంద్‌కే ముందు ఫోను చేశా. తను అన్నగా కంటే ఓ స్నేహితుడిలా, మార్గదర్శిగా ఉంటాడు. రాఖీ పండగ వస్తోంది కదా... వీలైనంత త్వరగా ఒక మంచి రాఖీ కొని తనకు పంపాలి.

ఇవీ చూడండి: 'అల్లు అర్జున్​ నా క్రష్.. ఆ వార్తలు చూసి నవ్వుకుంటా'

ABOUT THE AUTHOR

...view details