తన అందం, అభినయంతో పాటు అదిరిపోయే డ్యాన్సులతో అందర్నీ అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హోస్ట్ అవతారం ఎత్తనుంది. అది కూడా ఒక తెలుగు టీవీ కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో పుట్టి పెరిగిన తమన్నా తెలుగు చక్కగా మాట్లాడగలదు. అందుకే ఒక తెలుగు టీవీ ఛానల్‌లో ప్రసారం కానున్న 'మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు' అనే కార్యక్రమంలో హోస్ట్‌గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్టు ద్వారా ఈ విషయం వెల్లడైంది.
షూట్‌కు సిద్ధమవుతున్నప్పుడు తీసిన ఒక ఫొటోను తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. 'మాస్టర్ చెఫ్ తెలుగు త్వరలో రాబోతోంది' అంటూ ఆ ఫొటో కింద రాసుకొచ్చింది. దీంతో తమన్నా మొదటిసారిగా ఒక టీవీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఖరారైంది. ఇదే కార్యక్రమాన్ని విజయ్ సేతుపతి హోస్ట్‌గా తమిళంలో ప్రసారం చేయబోతున్నారట. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హోస్ట్ చేయనున్నట్లు సమాచారం.