ఒకానొక సమయంలో తాను కథానాయికగా నటించిన ఓ బాలీవుడ్ సినిమా పరాజయమైందని.. అప్పట్లో అది తనకో పెద్ద దెబ్బ అని హీరోయిన్ తమన్నా చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నుంచి విశ్రాంతి దొరకడం వల్ల ఇంటికే పరిమితమైన ఈమె.. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ బాలీవుడ్‌లో తన కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
''హిమ్మత్‌వాలా' దెబ్బకు ఆ విషయం తెలిసొచ్చింది'
బాలీవుడ్‌లో తన తొలి సినిమా పరాజయం పాలవడం మంచే చేసిందని చెప్పింది తమన్నా. దాని వల్ల నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలని తెలిసొచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
'కథానాయికగా నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చిత్రం 'హిమ్మత్‌వాలా'. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఆ పరాజయం కెరీర్ పరంగా నాకో పెద్ద దెబ్బ. అంతేకాకుండా నా జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయమూ అదే. అయితే అది పరాజయం చెందిన సమయంలో, వేర్వేరు ఇండస్ట్రీల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. వరుస షూటింగ్స్ ఉండటం వల్ల ఆ ఫ్లాప్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఒకేసారి 4-5 చిత్రాల్లో పనిచేయడం వల్ల అది విజయం సాధించలేదు లేదా ఈ ఫ్లాపైంది అనే విషయాన్ని నేను ఆలోచించలేకపోయేదాన్ని. అయినా సరే ఆ పరాజయం ఏదో ఓ రకంగా మంచికే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలని అర్థమైంది' -తమన్నా భాటియా, హీరోయిన్