తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందం.. అభినయం.. తమన్నా సొంతం..! - తమన్నా భాటియా ఫొటోలు

తమన్నా భాటియా.. అందం, అభినయం, డ్యాన్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నటి. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్​చరణ్ లాంటి అగ్రహీరోలతో నటించి మెప్పించింది. ఈరోజు మిల్కీ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

Tamanna
తమన్నా

By

Published : Dec 21, 2019, 5:41 AM IST

Updated : Dec 21, 2019, 7:19 AM IST

అందంతో పాటు కాసింత నటన కూడా తెలిసుండాలి. మన యువ కథానాయకులకు దీటుగా డ్యాన్సులు కూడా ఇరగదీయాలి. మరి ఎవరున్నారు? "తమన్నాలాంటి కథానాయిక అయితేనే బాగుంటుంది. డేట్లున్నాయేమో ఓసారి ప్రయత్నించి చూడకూడదూ" - అవతలి నుంచి కచ్చితంగా వినిపించే మాట ఇది. ఇటు అందంలోనైనా, ఇటు నటనలోనైనా.. ఎందులోనూ వెనక్కి తగ్గని కథానాయిక తమన్నా భాటియా. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే.. ఆమె ఓ ఎక్‌స్ట్రార్డినరీ కథానాయిక. మూతిముడుపులలోనైనా, నడుమొంపుల్లోనైనా తమన్నానే చూడాలి. ఏదో గాలివాటంతో ఆమె కథానాయిక అయిపోలేదు. పారితోషికం కోసం నటించడం లేదు. స్వతహాగా ఆమెకి సినిమా అంటే పిచ్చిప్రేమ. తనని తెరపై తప్ప మరో చోట ఊహించుకోలేదు.

తమన్నా

ఫ్రమ్‌ ముంబయి

21 డిసెంబర్‌ 1989లో ముంబయిలో జన్మించింది తమన్నా. తండ్రి పేరు సంతోష్‌ భాటియా. తల్లి రజనీ భాటియా. అన్న పేరు ఆనంద్‌. మాణిక్‌జీ కూపర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో చదువుకుంది. పదమూడేళ్ల వయసులో స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలో పాల్గొంది. అక్కడ తమన్నా ఓ దర్శకుడి దృష్టిలో పడటం, ఆయన సినిమా కోసం ఎంపిక చేసుకోవడం చకాచకా జరిగిపోయాయి. స్వతహాగా సినిమా అంటే తమన్నాకి ప్రాణం. ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఎప్పటికైనా నటి కావాలనుకుందట. అందుకే అవకాశం రాగానే ఎగిరి గంతేసింది. అప్పటికే కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించిన అనుభవం ఉండటం వల్ల ఆమెకి తెరప్రవేశానికి ఎలాంటి అడ్డంకులూ రాలేదు. 'చాంద్‌ షా రోషన్‌ చెహ్రా' అనే చిత్రంలో జియా ఒబెరాయ్‌ అనే పాత్ర పోషించింది.

తమన్నా

శ్రీకారం

తొలి చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. అయినా.. నిరుత్సాహపడకుండా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చదువులకు గుడ్‌ బై చెప్పేసి "ఇక్కడే ఉంది నా జీవితం" అంటూ సినిమాకే అంకితమైంది. అదే సమయంలో.. తెలుగు నుంచి 'శ్రీ'లో నటించే అవకాశం దక్కింది. అది మంచు మనోజ్‌ తొలి చిత్రం. చిన్న వయసు, భాష తెలియదు.. చుట్టూ కొత్త వాతావరణం. తమన్నా మాత్రం భయపడలేదు సరికదా..అందం, అభినయం పరంగా చక్కటి పరిణతిని కనబరచింది. అయితే.. సినిమా మాత్రం ఆడలేదు. తర్వాత తెలుగులో వెంటనే అవకాశం దక్కకపోయినా తమిళం నుంచి పిలుపొచ్చింది. 'కేడి'లో ఇలియానాతో కలిసి రవికృష్ణ సరసన నటించింది.

తమన్నా

అప్పటి నుంచి హ్యాపీడేస్‌

అప్పటిదాకా పరాజయాలతో సాగుతున్న తమన్నా ప్రయాణాన్ని ఒక్కసారిగా మలుపుతిప్పింది 'హ్యాపీడేస్‌'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2007లో విడుదలై ఘనవిజయం సాధించింది. తమన్నా పోషించిన మధు పాత్రకి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తరువాత కెరీర్‌ పరంగా మళ్లీ వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. 'హ్యాపీడేస్‌' తమిళంలోనూ పునర్నిర్మితమైంది. తెలుగులో పోషించిన పాత్ర తమిళంలోనూ దక్కింది. అక్కడ కూడా సినిమా విజయవంతం కావడం వల్ల.. ఒక్కదెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా తమన్నాకి చక్కటి ఫలితాలు దక్కాయి. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ స్టార్‌ కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు రావడం మొదలైంది. 'కాళిదాసు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాల తరువాత తమన్నా స్టార్స్‌తోనే ఎక్కువగా నటించింది. కోటి రూపాయల కథానాయికల జాబితాలోకి చేరిపోయింది.

మిల్కీ అందం

కథానాయిక అనగానే ముందు అందమే చూస్తారు. తమన్నా అందంతోపాటు నటనలోనూ మేటి అనిపించుకుంది. అదే ఆమెని ఒక్కో మెట్టుపైకి తీసుకొచ్చింది. '100% లవ్‌'లో మహాలక్ష్మిగా అదరగొట్టింది. ఆ చిత్రం విజయవంతం అవ్వడం వల్ల తెలుగులో 'బద్రినాథ్‌', 'ఊసరవెల్లి', 'రచ్చ' 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', 'ఆగడు' చిత్రాల్లో అవకాశాలు సంపాదించింది. ఆయా చిత్రాల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌, మహేశ్ బాబు లాంటి కథానాయకులతో నటించింది. ప్రభాస్‌తో కలిసి 'బాహుబలి'లో నటించి మెప్పించింది.

ప్రేమ వ్యవహారం

చిత్రసీమలో కథానాయికల వ్యక్తిగత జీవితాలు తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంటాయి. ప్రేమ, డేటింగ్‌ అంటూ ప్రచారాలు సాగుతుంటాయి. అయితే తమన్నా విషయంలో మాత్రం ఆ పుకార్లు తక్కువే. అందరితోనూ చనువుగా ఉన్నా..ప్రేమ, దోమా అంటూ ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కలేదు. ఆమెతో కలిసి పనిచేసిన ప్రతి కథానాయకుడు కూడా ‘తమన్నా చాలా ప్రొఫెషనల్‌’ అంటుంటారు. అయితే ఆమె హిందీలోకి వెళ్లాక ఓ వదంతి బయటకు వచ్చింది. హిందీ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్‌తో ప్రేమాయణం సాగిస్తోందనీ, ఇద్దరూ లిఫ్ట్‌లో ముద్దులు పెట్టుకున్నారనీ చెవులు కొరుక్కొన్నారు. ఆ విషయం సాజిద్‌ఖాన్‌ చెవిలో కూడా పడింది. అతడు వెంటనే స్పందిస్తూ.."తమన్నా నా చెల్లెలులాంటిది" అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఆ పుకారుకు పుల్‌స్టాప్‌ పడింది.

ఐటెమ్‌ భామగా ఎన్టీఆర్‌ చిత్రం 'జై లవకుశ'లో చేసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటించిన 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', ఈ మధ్యనే వచ్చిన తెలుగు, కన్నడ చిత్రం 'కె.జి.ఎఫ్‌'లో తన సత్తా ఏంటో చూపింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన చిత్రం 'ఎఫ్‌2'. ఇందులో వెంకి, వరుణ్‌లతో కలిసి అలరించింది. చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించిన చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లోను లక్ష్మీ పాత్రలో కనిపించి అలరించింది. మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో ప్రత్యేక గీతంలో కనిపించనుంది.

ఇవీ చూడండి.. రెట్టింపు నవ్వులకు రంగం సిద్ధమైందా..!

Last Updated : Dec 21, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details