ఈ రోజు జరిగిన దిల్లీ ఎన్నికల్లో తాప్సీ, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంది. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ముంబయిలో ఉంటూ, దిల్లీలో ఓటేయడమేంటని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించగా, అందుకు తగ్గట్లుగానే సమాధానమిచ్చిందీ భామ.
ఇంతకీ ఏం జరిగింది?
తాప్సీ పోస్ట్ చేసిన ఓ ఫొటోకు.. "ముంబయిలో నటిగా పనిచేస్తున్న తాప్సీకి దిల్లీలో ఓటెందుకు? ఆమె తన ఓటును ముంబయికి మార్చుకోవాలి. ముంబయిలో నివాసం ఉంటున్న మీరెందుకు మా భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారు? తాప్సీ చాలా కాలం నుంచి ముంబయిలోనే ఉంటున్నప్పటికీ ఆమె తన ఓటును ఎందుకు అక్కడికి మార్చుకోలేదు. ఆమె తన ఓటును ముంబయికి బదిలీ చేసుకోవాలి" అని నెటిజన్ పేర్కొన్నాడు.
దిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తాప్సీ కుటుంబం ఈ కామెంట్‌కు ఘాటుగా స్పందించిన తాప్సీ.. తన పౌరసత్వం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంది. ముంబయి కంటే దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టం చేసింది.
"దయచేసి నా పౌరసత్వం గురించి ప్రశ్నించొద్దు. మీ గురించి.. మీరు అందిస్తున్న సేవల గురించి ఆలోచించుకోండి. ఒక అమ్మాయిని దిల్లీ నుంచి బయటకు తీసుకురావొచ్చు. కానీ ఆ అమ్మాయి నుంచి దిల్లీని విడదీయలేరు. నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాల్సింది మీరు కాదు. నాకు దిల్లీతో ఉన్న బంధం ఎలాంటిదో చెప్పేందుకు ఈ సమాధానం సరిపోతుందనుకుంటున్నా" అని తాప్సీ రాసుకొచ్చింది.
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'తప్పడ్'. అనుభవ్ సిన్హా దర్శకుడు. ఈ సినిమాలో భర్తను, కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఇల్లాలి పాత్రలో కనిపించనుందీ భామ. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.