గ్లామరస్ పాత్రలతో పరిచయమైన తాప్సీ... వివిధ భాషల్లోని కథాప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'తప్పడ్'. గృహ హింసకు సంబంధించిన కథతో రూపొందించారు. అనుభవ్ సిన్హా దర్శకుడు. రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సిన్హా గురించి ఇన్‌స్టాలో పలు విషయాలను రాసుకొచ్చిందీ భామ.
భవిష్యత్తులో ఎవరైనా తన గురించి పుస్తకం రాస్తే అందులో తప్పకుండా సిన్హా పేరు ప్రస్తావించాల్సిందేనని తాప్సీ చెప్పింది. అతడి ప్రస్తావన లేకపోతే అది అసంపూర్ణమని అంది.
"అతని ప్రేమ, రచన, మాటతీరు పట్ల నేను వీరాభిమానిని. అతని దర్శకత్వంలో రెండోసారి పనిచేయడం గర్వంగా భావిస్తున్నా. అనుభవ్.. తన దర్శత్వంలో నటిస్తున్న వారి నుంచి పూర్తిస్థాయి నటన రాబట్టుకోగలడు. నాపై ఎవరైనా పుస్తకం రాస్తే అందులో సిన్హా పాత్ర ఉండాల్సిందే. లేకపోతే అది అసంపూర్ణం. రేపు విడుదలయ్యే మన సినిమా(తప్పడ్) కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నా. త్వరలోనే మన రికార్డ్‌ను మనమే తిరగరాస్తామని అనుకుంటున్నా"