తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటనను శాసించిన యశస్వి మన 'ఎస్వీ'

తనదైన నటనతో ప్రేక్షకులను రక్తికట్టించిన విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ ఎస్వీ రంగారావు వర్దంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.

sv rangarao DEATH DAY SPECIAL STORY
ఎస్వీ రంగారావు

By

Published : Jul 18, 2020, 3:25 PM IST

సినిమాల్లో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్వీ రంగారావు చలనచిత్ర రంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. 'పాతాళభైరవి' విడుదలయ్యే వరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మక్కువతో చేతికందిన ఉద్యోగాలు వదులుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు ఉన్నాయి.

కుటుంబ కథాచిత్రాలే కాదు, డిటెక్టివ్‌ చిత్రాల్లోనూ రాణించిన రంగారావు.. తొలి సినిమాలో నటించేందుకు అనేక ఇబ్బందులు, ఆటుపోట్లతో పాటు అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ నటసార్వభౌముడు తదనంతరకాలంలో పాత్రలను మించి ఎదిగి నటించారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించిన ఆ మహనీయుని వర్దంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

ఎస్వీ రంగారావు

నటసార్వభౌముని తొలిరోజులు.

ఎస్వీ రంగారావుగా పిలుచుకునే సామర్ల వెంకట రంగారావు.. 1918 జులై 3న కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నదమ్ములు, ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు. కుటుంబం పెద్దది కావడం వల్ల అందరూ తాత ఇంట్లోనే పెరిగారు. తాత డాక్టర్‌ కోటయ్య నాయుడు నూజివీడులో పెద్ద శస్త్రచికిత్సా నిపుణుడిగా పేరు గడించారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, బ్రహ్మసమాజ సానుభూతిపరుడు. ప్రముఖ తెలుగు చలనచిత్ర పితామహుడుగా కీర్తించబడే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు రంగారావు తాత సన్నిహితుడు. రంగారావు తల్లి లక్ష్మీనరసమ్మ గృహిణి. తండ్రి కోటేశ్వరరావు నాయుడు ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా బ్రహ్మసమాజ కార్యకర్తే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రంగారావు తండ్రి సహాధ్యాయి. ఉద్యోగరిత్యా తండ్రి ఊళ్లు మారుతుండడం వల్ల రంగారావు ఆలనా పాలనా నూజివీడులో తాత ఇంటనే సాగింది. రంగారావుకు రెండేళ్ల వయసున్నప్పుడు తాత మద్రాసుకు మకాం మార్చారు.

హైస్కూలు చదువుకు రాకముందే ఆయన తాత మద్రాసులో మరణించారు. నాయనమ్మ గంగారత్నం సంరక్షణలోనే రంగారావు పెరిగారు. మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో చదువు సాగింది. నాయనమ్మ కట్టుదిట్టంలో పెంచడం వల్ల పిరికితనం ఆవహించి, ఆత్మవిశ్వాసం లోపించిన వ్యక్తిగా పెరిగి పెద్దవాడయ్యారు. రంగారావుకు నాటకాల మీద ఆసక్తి. ఆ నాటకాలకు వెళ్లాలంటే ఏవో సాకులు చెప్పాల్సిన పరిస్థితి. వంశమర్యాదలకు నాయనమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ సంఘర్షణలో రంగారావులో తిరుగుబాటు లక్షణం బలపడింది. 15 సంవత్సరాల వయసులో ఆయన స్కూలులో ఓ నాటకంలో మాంత్రికునికి సహాయకుడిగా నటించారు. భవిష్యత్తులో అలాంటి మాంత్రికుడి పాత్రే తనని నటుడుగా నిలబెడుతుందని ఊహించలేకపోయారు.

అప్పుడే బలమైన కాంక్ష

1936లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ వారు ప్రదర్శించిన పోటీ నాటకాల్లో ఆనాటి సూపర్‌ స్టార్లు అనదగిన బళ్లారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు వంటి నిష్ణాతులు నటించడం చూశాక రంగారావువుకు నటుడు కావాలని బలమైన ఆకాంక్ష పెరిగింది. అప్పుడే టాకీ సినిమాలు రావడం వల్ల మద్రాసులో ఆడుతున్న తమిళ, తెలుగు, హిందీ సినిమాలు చూడడం అలవాటైంది. రంగారావు చూసిన తొలి తెలుగు సినిమా 'లవకుశ' (1934), తొలి హిందీ సినిమా 'అచ్యుత్‌ కన్య' (1936), తొలి తమిళ సినిమా 'అంబికా పతి' (1937). సినిమాల్లో, నాటకాల్లో నటించాలంటే వాచకం చాలా అవసరమని భావించి, రంగారావు వక్తృత్వ పోటీల్లో ఎక్కువగా పాల్గొనడం ప్రారంభించారు. శరీర సౌష్టవం కోసం ఆటల్లో పాల్గొనేవారు. ఏలూరులో రంగారావు మేనత్త భర్త, గంగారత్నం అల్లుడుగారైన బడేటి వెంకట్రామయ్య నాయుడు మరణించడం, మేనత్త వద్దకు మకాం మార్చడం వల్ల రంగారావు హైస్కూల్‌ చదువు ఏలూరుకు మారింది.

ఎస్వీ రంగారావు

బడేటి వెంకట్రామయ్య నాయుడు ఆరోజుల్లో గోదావరి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఉంటూ జస్టిస్‌ పార్టీలో అగ్రనాయకుడిగా ఎదిగారు. ఏలూరులో చదువు పూర్తయ్యాక రంగారావు ఇంటర్మీడియట్‌ చదువుకోసం విశాఖపట్నం వెళ్లి ఎ.వి.ఎన్‌ కాలేజిలో చేరారు. ఆ కాలేజి ప్రిన్సిపాలు సుంకర పార్థసారథి, రంగారావు తండ్రి మంచి మిత్రులు. రంగారావు వ్యక్తిత్వానికి మెరుగుపెట్టి ఓ స్వరూపాన్ని కలిగించిన వ్యక్తి పార్థసారథి. కాలేజి విద్యార్థి సంఘాల్లో రంగారావుకు ఎన్నో పదవులు కల్పించారు. తండ్రికన్నా రంగారావుకు ఎంతో సన్నిహితులయ్యారు. నియమాలు నేర్పారు. మంచి పౌరునిగా తీర్చిదిద్దారు. తరువాత బి.ఎస్‌.సి చదవడానికి కాకినాడ వెళ్లారు. పిఠాపురం రాజావారి కళాశాలలో బి.ఎస్‌.సి.లో చేరారు. 1943లో పట్టా పుచ్చుకున్నారు. అక్కడ చదువుకుంటూనే యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో నాటకాలు వేయడం మొదలెట్టారు. ఆ క్లబ్‌కు దంటు సూర్యారావు అధ్యక్షుడిగా ఉండేవారు.

పెనుపాత్రుని ఆదినారాయణరావు (అంజలీదేవి భర్త ఆదినారాయణరావు) ఆ నాటక సమాజానికి కార్యనిర్వాహకుడు, శిక్షకుడు, సంగీత దర్శకుడిగా వ్యవహరించేవారు. రంగారావు యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ తరఫున 'లోభి' అనే నాటకంలో హీరోగా, 'పీష్వా నారాయణరావు వధ' అనే నాటకంలో అరవై ఏళ్ళ వృద్ధ రఘునాథరావు పాత్రలోను నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదినారాయణరావు రచించి దర్శకత్వం వహించిన 'వీధి గాయకులు' అనే నాటకంలో రంగారావు అంజలీదేవితో కలిసి నటించారు. అంజలీదేవి ఆ సమాజం ప్రదర్శించే అన్ని నాటకాల్లోనూ నృత్యం చేస్తూ, స్త్రీ పాత్రలు పోషిస్తూ ఉండేవారు. అప్పట్లో రైల్వే శాఖలో టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగం చేస్తున్న దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు కూడా రంగారావుతో పాటు నాటకాల్లో నటిస్తుండేవారు. రంగస్థలనటుడిగా రాణిస్తున్న రోజుల్లో ‘పోతన’ చిత్ర శతదినోత్సవ సభకు దర్శకుడు కె.వి.రెడ్డి కాకినాడ రావడం జరిగింది. అప్పుడే రంగారావు కె.వి.రెడ్డికి పరిచయం అయ్యారు. ఇంతెందుకు... ప్రముఖ దర్శక నిర్మాత, నటులు ఎల్‌.వి.ప్రసాద్‌ రంగారావు కుటుంబానికి సన్నిహిత మిత్రులు.

ఏలూరులో రంగారావు ఇల్లు, ప్రసాద్‌ ఇల్లు ఎదురెదురుగా ఉండేవి. ఇన్ని ప్రాపకాలు ఉండి కూడా రంగారావుకు సినిమాలలో నటించే అవకాశం రాలేదు. అయితే అతని రంగస్థల నటన ఒక మంచి ఉద్యోగం సంపాదించి పెట్టేందుకు ఉపకరించింది. సైనికుల వినోదార్ధం కాకినాడలో ‘వీధిగాయకులు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ హ్యాన్డింగ్‌ హ్యామ్‌ హాజరవడం జరిగింది. రంగారావు నటనకు ముగ్ధుడైన ఆ డైరెక్టర్‌ రంగారావు బి.ఎస్‌.సి పట్టభద్రుడని తెలుసుకొని అగ్నిమాపక శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అలా రంగారావుకు ఫైర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం ఖాయమైంది. దాంతో రంగారావు మద్రాసు వెళ్లి మూడు నెలల శిక్షణ పూర్తిచేశారు. మొదటి పోస్టింగ్‌ బందరులో. అయితే అక్కడ కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. తరువాత విజయనగరం బదలీ కావడం వల్ల కళలకు పుట్టిల్లైన ఆ ఊర్లో నాటకాలు వెయ్యడం మొదలెట్టారు.

కలిసొచ్చిన అవకాశం...కలిసిరాని కాలం...

1946 ఆరంభంలో తలవని తలంపుగా రంగారావు జీవితం ఒక మలుపు తిరిగింది. రంగారావు సమీప బంధువు బి.వి.రామానందం 'వరూధిని' అనే సినిమా నిర్మించాలచి, ప్రవరాఖ్యుడు పాత్రకోసం నటుల అన్వేషణలో పడ్డారు. అతడు రంగారావు విషయం తెలుసుకొని, ఆ పాత్రను పోషించేందుకు మద్రాసు రమ్మని కబురెట్టారు. రంగారావు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి మద్రాసు చేరుకున్నారు. ఆరోజుల్లో సినిమాలు మద్రాసుతోబాటు కొల్హాపూర్, సేలం, కలకత్తా నగరాల్లో ఎక్కువగా నిర్మించబడుతుండేవి. ‘వరూధిని’ సినిమాను సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ స్టూడియోలో ప్రారంభించారు. రంగారావుకు నెలకు ముట్టిన జీతం 250 రూపాయలు. అందులో దాసరి తిలకం (నటి గిరిజ తల్లి) వరూధినిగా నటించింది. ఆ సినిమా 1947 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది. అందులో రంగారావు పేరును ఎస్‌.వి.ఆర్‌.రావ్, బి.ఎస్సీ అని టైటిల్స్‌లో వేశారు. కానీ రంగారావుకు ఆ పాత్ర అంతబాగా నప్పలేదు.

ఎస్వీ రంగారావు

కాకినాడ ఎల్ఫిన్‌ టాకీసులో, ఏలూరు, రాజమండ్రి సినిమా హాళ్లలో తొలిసారి ఈ సినిమా విడుదలైంది. తరువాత బెజవాడ, గుంటూరులో విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్‌ ముద్రపడింది. దాంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. మరలా ఉద్యోగం వెదుక్కుంటూ జంషెడ్​పూర్ వెళ్లి టాటా స్టీల్‌ ఫ్యాక్టరీలో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. రెండేళ్లపాటు అక్కడే ఉండిపోయారు. 1947 డిసెంబరు 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని వివాహమాడి రంగారావు ఒక ఇంటివాడయ్యారు. అక్కడి ఆంధ్రా కల్చరల్‌ క్లబ్‌ వారు నిర్వహించి నాటకాల్లో, ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో రంగారావు వేషాలు వేస్తుండేవారు. అక్కడి ఆంధ్ర సంఘం వారు ప్రదర్శించే 'వీరాభిమన్యు', 'వెన్నెల', 'ఊర్వశి' వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు రంగారావే పోషించేవారు. అప్పుడే సినీ నిర్మాతగా అవతారమెత్తుతున్న బి.ఎ.సుబ్బారావు 'పల్లెటూరిపిల్ల' చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రతినాయకుడు కంపనదొరగా నటించేందుకు రావలసిందిగా రంగారావుకు టెలిగ్రాం ఇచ్చారు.

కానీ, అదే సమయంలో రంగారావు తండ్రి చనిపోయారు. ధవళేశ్వరం నుంచి టెలిగ్రాం రావడం వల్ల రంగారావు ధవళేశ్వరం వెళ్లారు. మరణశయ్యపై వున్న తండ్రి రంగారావుతో 'నువ్వు ప్రపంచంలో ఎవరికీ భయపడవద్దు. నువ్వు మంచిదని తోచిన పనిని ఎవరు ఆమోదించక పోయినా ఆచరించు' అంటూ హితబోధ చేశారు. తండ్రి అంత్యక్రియలు వగైరా పూర్తి చేసుకొని రంగారావు మద్రాసు వెళ్లేసరికి, అప్పటికే ఆలస్యమైందని దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావు ఆ కంపనదొర పాత్రను ఎ.వి.సుబ్బారావుకు ఇచ్చేశారు.

ఓ చిన్న పాత్ర

అయితే అంత దూరం నుంచి తనని నమ్ముకొని, ఉద్యోగం వదలుకొని వచ్చారని బాధపడి అందులో ఒక చిన్న పాత్రను రంగారావుకు ఇచ్చారు. అది అంజలీదేవి తండ్రి పాత్ర! సమాంతరంగా రంగారావును బి.ఎ. సుబ్బారావు ఎల్‌.వి.ప్రసాద్‌కు పరిచయం చేశారు. అప్పుడు ప్రసాద్‌ 'మనదేశం' సినిమాకు దర్శకత్వం వహిస్తునారు. అందులో ఎన్‌.టి.రామారావుతోబాటు రంగారావుకు కూడా పోలీసు ఇన్స్పెక్టర్‌ పాత్రను ఇచ్చారు. ప్రసాద్‌ సిఫారసు మీదే పి.పుల్లయ్య రంగారావుకు ‘తిరుగుబాటు’ అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అలాగే హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘నిర్దోషి’ చిత్రంలో ప్రాత్రకోసం సిఫార్సు చేస్తే, అది అంతకు ముందే ముక్కామలకు వెళ్ళింది.

విజయా సంస్థతో అంబరానికి...

అప్పుడే విజయా సంస్థ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి తొలిప్రయత్నంగా 'షావుకారు' చిత్రాన్ని నిర్మిస్తూ ఎన్‌.టి.రామారావును ఘంటసాలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. అందులో సున్నం రంగడి పాత్రకు సదాశివరావును తీసుకోవాలని భావించినా దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ మాత్రం ఎస్‌.వి.రంగారావును ప్రతిపాదించారు. అలా రంగడిపాత్ర రంగారావుకు దక్కింది. ఈ రౌడీ పాత్రను విభిన్నంగా పోషించాలనే ఉద్దేశ్యంతో ఒక రిక్షావాడు మాట్లాడే పధ్ధతి, నడిచే తీరు, బీడీ కాల్చే విధానం బాగా పరిశీలించి ఆ పద్ధతిని అనుసరించారు. ప్రేక్షకులకు రంగారావు నటన బాగానచ్చింది. సినిమా గొప్పగా ఆడకపోయినా చక్రపాణికి 'షావుకారు' కథమీద మమకారం పోలేదు. కొంతకాలం తరువాత అదే సినిమాని తమిళంలో 'ఎంగవీట్టు పెణ్‌' పేరుతో పునర్నిర్మించారు.

అందులో రంగడి పాత్ర రంగారావుకే అనుకున్నా, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ పాత్ర ఎస్‌.వి.సుబ్బయ్యకు దక్కింది. తమిళంలో ఈ చిత్రం బాగా విజయవంతమైంది. విజయావారు తెలుగు, తమిళంలో నిర్మించిన రెండవ చిత్రం 'పాతాళభైరవి'లో నేపాళ మాంత్రికుడి పాత్ర రంగారావు వశమై, చరిత్ర సృష్టించి నటుడిగా నిలబెట్టింది. ఈ పాత్రతో రంగారావుకు సినిమా నటులలో మహోన్నత స్థానం, అసంఖ్యాకులైన ప్రేక్షకుల అభిమానం లభించాయి. ఇందులో పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు చదివే మంత్రాల కోసం మంత్రపుష్పంలోని వేదమంత్రాలను తిరగరాయించి విచిత్రమైన భాషగా రంగారావు చేత పలికించారు. సినిమా అఖండవిజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం భారతీయ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది.

ప్రేక్షకుల్ని రక్తికట్టించి

ఎస్వీ రంగారావు

తరువాత విజయా సంస్థ నిర్మించిన మరో ద్విభాషా చిత్రం 'పెళ్ళిచేసిచూడు' ('కల్యాణం పన్ని పార్‌'1952)లో జమీందారు ధూపాటి వియ్యన్న పాత్రలో రంగారావు హాస్యరసాన్ని మేళవించి విభిన్న మ్యానరిజంతో రక్తికట్టించి ప్రేక్షకుల మనసుల్ని మరోసారి దోచేశారు. మద్రాసు సెంట్రల్‌ స్టేషన్‌లో ఒక వ్యక్తి ముక్కుపుటాలను ఎగరవేస్తూ వింతగా మాట్లాడడం గమనించిన రంగారావు అదే మ్యానరిజంని ఈ చిత్రంలో అనుకరించారు. తమిళ వర్షన్‌ని మాత్రం పాక్షికంగా గేవాకలర్‌లో నిర్మించారు. 'పాతాళభైరవి'లాగే ఈ చిత్రం కూడా అద్భుతంగా ఆడి విజయావారికి కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తరువాత ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలోనే విజయా వారు 'మిస్సమ్మ' (1955) చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం కూడా ద్విభాషా చిత్రమే. కాకపొతే ఇందులో తమిళ నటులు వేరు, తెలుగు నటులు వేరు. అయితే రంగారావు మాత్రం అటు తెలుగు ఇటు తమిళ వర్షన్లలో నటించి మెప్పించారు. ఈ సినిమాల మధ్య కాలంలో కోవెలమూడి భాస్కరరావు నిర్మించిన ‘బ్రతుకుతెరువు’ చిత్రంలో జమీందారు బాలాసాహెబ్‌గా, భానుమతి నిర్మించిన 'చండీరాణి' ద్విభాషా చిత్రంలో ప్రచండుడుగా, వినోదావారి 'దేవదాసు' ద్విభాషా చిత్రంలో జమీందారు నారాయణరావుగా, ఎ.వి.ఎం వారి ‘సంఘం’ ద్విభాషా చిత్రంలో సీతారామాంజనేయ దాసుగా రంగారావు నటించారు.

బంగారు పాప లో కోటయ్యగా..

.బి.ఎన్‌.రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘బంగారు పాప’ (1955 ) చిత్రంలో రంగారావు కోటయ్య పాత్ర ప్రత్యేకమైంది. ఒక రౌడీగా, తాగుబోతుగా జీవనం సాగించే కోటయ్య తనచేతికి ఒక బాలిక రావడంతో పూర్తిగా మారిపోతాడు. ఇందులో రంగారావు పాత్ర యవ్వనం, నడివయసు, వార్ధక్యం వంటి వివిధ దశల్లో సాగుతుంది. రంగారావు పాత్ర ఈ సినిమాకు వెన్నెముక. ఆయనలేని 'బంగారుపాప' చిత్రాన్ని ఊహించలేం. భీమవరంలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా వున్న పాలగుమ్మి పద్మరాజును ఈ చిత్రం ద్వారా బి.ఎన్‌.రెడ్డి రచయితగా పరిచయం చేశారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి లభించింది. దేవులపల్లి రాసిన 'తాధిమి తకధిమి తోలు బొమ్మా దీని తమాష చూడవే కీలుబొమ్మా' పాట ఆరోజుల్లో అందరికీ కరతలామలకమే.

ఈ పాటకు మాత్రం స్వరాలల్లింది బాలాంత్రపు రజనీకాంత రావు. నేటికీ ఆ పాట ఎక్కడో ఒకదగ్గర వినపడుతూనే వుంటుంది. ‘బంగారుపాప’ చిత్రం ఆశించినంత గొప్పగా ఆడకపోయినా, లండన్, న్యూయార్క్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు నోచుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమచిత్రంగా రజత పతకం కైవసం చేసుకుంది. తరువాత అదే సంవత్సరం విడుదలైన విజయావారి ‘చంద్రహారం’ చిత్రంలో రంగారావు ధూమకేతు పాత్ర పోషించారు. రెండుభాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

అయితే బి.ఎ.సుబ్బారావు నిర్మించిన ‘రాజు-పేద’లో మహారాజు సురేంద్రదేవ్‌ పాత్రలో రంగారావు జీవించారు. మార్క్‌ ట్వేన్‌ రచించిన ప్రసిద్ధ నవల ‘ది ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం విజయఢంకా మ్రోగించింది. సుబ్బారావు తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’ విజయవంతం కావడంతో 'రాజు-పేద' నిర్మాణానికి పూనుకున్న సుబ్బారావుకు ఈ సినిమా కూడా కాసులు రాల్చింది. ఈ చిత్రం ద్వారా పినిశెట్టి శ్రీరామమూర్తి రచయితగా పరిచయమయ్యారు. తరువాత అంజలీదేవి నిర్మించిన ‘అనార్కలి’ (1955) చిత్రంలో రంగారావు ప్రధానమైన అక్బర్‌ పాత్ర పోషించి మెప్పించారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా, తమిళంలోకి డబ్‌ చేయగా అక్కడ కూడా వందరోజులు ఆడింది.

వీరతాడు వేసిన 'మాయాబజార్‌'...

'మిస్సమ్మ' హిట్‌తో ఎన్‌.టి.రామారావు కెరీర్‌ ఊపందుకుంది. ఒకసారి దర్శకనిర్మాత కె,.వి. రెడ్డి రామారావును పిలిచి 'భారతంలో ఘటోత్కచుడి పాత్రను హైలైట్‌ చేస్తూ సినిమా తీయాలనుకుంటున్నాను. డేట్స్‌ కావాలి' అని అడిగారు. 'సార్‌... నేను మరీ రాక్షస పాత్ర ధరిస్తే బాగోదేమో’...రామారావు జవాబు. కె.వి. నవ్వి 'లేదయ్యా ... నీది కృష్ణుడి పాత్ర' అన్నారట. అంటే ఘటోత్కచుడి పాత్రకు 'మాయాబజార్‌' (1957) సినిమాలో అంతటి ప్రాధాన్యం వుందని! ఘటోత్కచుడుగా తదాత్మ్యంతో రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.తరవాత రోజుల్లో 'సతీసావిత్రి' చిత్రంలో యముడుగా, 'భక్త ప్రహ్లాద', 'చెంచులక్ష్మి'లో హిరణ్యకశిపుడుగా, 'శ్రీకృష్ణలీలలు'లో కంసుడుగా, 'పాండవవనవాసము'లో దుర్యోధనుడుగా, 'హరిశ్చంద్ర'లో హరిశ్చంద్రునిగా, మహారాజుగా, 'శ్రీకృష్ణాంజనేయయుద్ధం'లో బలరాముడుగా, 'ఉషాపరిణయం'లో బాణాసురుడుగా, 'సంపూర్ణ రామాయణం'లో రావణుడుగా, 'బాలనాగమ్మ'లో మాయల ఫకీరుగా, 'దీపావళి' చిత్రంలో నరకాసురుడుగా, 'భట్టివిక్రమార్క'లో మాంత్రికుడుగా, 'బొబ్బిలియుద్ధం'లో తాండ్రపాపారాయుడుగా, 'సారంగధర'లో నరేంద్రుడుగా, 'జయభేరి'లో విజయానంద రామగజపతిగా, 'కాళిదాసు'లో భోజమహారాజుగా, 'సతీ సావిత్రి'లో యమధర్మరాజుగా అనేక పౌరాణిక, జానపద పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. అలాగే 'అప్పుచేసి పప్పుకూడు', 'పెళ్లినాటి ప్రమాణాలు', 'నమ్మినబంటు', 'దేవాంతకుడు', 'గాలిమేడలు', 'మురళీకృష్ణ', 'మాంగల్యబలం', 'తోడికోడళ్ళు', 'వెలుగునీడలు’', 'గుండమ్మ కథ', 'చిలకా గోరింక', ‘'రాము', 'మంచిమనసులు', 'బందిపోటు దొంగలు', 'పండంటికాపురం' వంటి ఎన్నో సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన నటనే కాకుండా, పాత్రోచితమైన నటనను ప్రదర్శించి మన్నన పొందారు. రంగారావు నటించిన 'తాత-మనవడు' చిత్రం దాసరి నారాయణరావుకు దర్శకుడుగా మంచి పేరుతెచ్చిపెట్టింది.రాజ్యం పిక్చర్స్‌ వారు నిర్మించిన 'నర్తనశాల' చిత్రంలో రంగారావు కీచకుడుగా నటించారు.

ఎస్వీ రంగారావు

ఆ పాత్ర ఉండేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ పాత్రలో జీవించి నటించిన రంగారావుకు భారత రాష్ట్రపతి బహుమతి లభించింది. జకార్తా ఫిలిం ఫెస్టివల్‌లో రంగారావు నటనకు అబ్బురపడి, ఉత్తమ నటుడుగా అంతర్జాతీయ బహుమతి ప్రదానం చేశారు. 'యశోదాకృష్ణ' (1974) సినిమా రంగారావు నటించిన చివరి చిత్రం.నటసామ్రాట్‌గా, నిర్మాతగా...సినీ ప్రేక్షకులు, అభిమానులు రంగారావుని నటసామ్రాట్, విశ్వనటచక్రవర్తి మొదలైన బిరుదులతో గౌరవించారు. తమిళంలో 'అన్నై', 'శారద', 'కర్పగం', 'నానుమ్‌ ఒరు పెణ్‌', 'కుమారి పెణ్‌’', 'సెల్వమ్', 'పేసుమ్‌ దైవం', 'నమ్‌ నాడు', 'ప్రాప్తం', 'వసంత మాళిగై' వంటి తమిళ చిత్రాల్లోనూ, 'మై భి ఏక్‌ లడ్కి హూ' వంటి హిందీ చిత్రాల్లోనూ, 'విదయాగళే ఎతిలే ఎతిల', 'కవిత' వంటి మళయాళ సినిమాల్లోనూ తన నటన ప్రదర్శించి 'ఓహో' అనిపించుకున్నారు. రంగారావు 1966లో ఎ.వి.మెయ్యప్పచెట్టియార్‌తో భాగస్వామ్యం కలిపి 'నాదీ ఆడజన్మే' సినిమా నిర్మించి హిట్‌ చేశారు. తరువాత ఎస్‌.వి.ఆర్‌ ఫిలిమ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి నరసరాజుకు కబురంపారు.అప్పుడు ఎనిమిదేళ్లుగా అటకెక్కిన డి.వి.నరసరాజు స్క్రిప్టు 'చిదంబర రహస్యం' విషయం చర్చకొచ్చింది. ఆ స్క్రిప్టు రంగారావుకు బాగా నచ్చడం వల్ల 'చదరంగం' పేరుతో దా ిని సినిమాగా మలిచారు. ఎనిమిదేళ్లుగా మూలపడివున్న చదరంగం సినిమా స్క్రిప్టు చదివిన ఎస్వీఆర్‌తో 'ఎప్పుడో రాసిన కథ కదా, కొన్ని చిన్నచిన్న మార్పులు చేద్దామా' అని నరసరాజు అడిగితే, 'నాకు ఏ మార్పులూ అవసరం లేదు. అక్షరం కూడా మార్చకండి. నాకు బాగా నచ్చింది' అంటూ, 'దీనిని ఇంకొకరి చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే డైరెక్టు చేస్తాను' అని ఎస్వీఆర్‌ దర్శకత్వ బాధ్యతలు మోశారు. దర్శకుడుగా ఎస్వీఆర్‌కు ఇదే మొదటి చిత్రం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి ద్వితీయ ఉత్తమచిత్ర బహుమతిని అందజేసింది. నరసరాజుకు ఉత్తమ కథారచయిత బహుమతి దక్కింది. అన్యోన్యతకు, అనుబంధాలకు ప్రాధాన్యమిస్తూ 1968లో రంగారావు ‘బాంధవ్యాలు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలను రంగారావే నిర్వహించడం విశేషం. ఈ సినిమాలో వచ్చే ముఖ్య సన్నివేశాలను రేఖాచిత్రాలుగా టైటిల్స్‌ ప్రక్కనే చూపడం ఆ రోజుల్లో కొత్త ప్రయోగం. హీరోయిన్‌ లక్ష్మికి ఇదే తొలి చిత్రం కావడం కూడా మరో విశేషం. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది బహుమతి లభించింది. మెత్తంమీద రంగారావు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details