'కాళిదాసు'గా తెరంగేట్రం చేసి.. 'కరెంట్'తో తెలుగు సినిమా పరిశ్రమను తన 'అడ్డా'గా మార్చుకున్న నటుడు సుశాంత్. అక్కినేని వారసుల్లో ఒకరిగా పరిచయమైన ఇతడు 'చి.ల.సౌ'తో తన పంథాని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా, కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
అక్కినేని నాగేశ్వరరావు కూతురైన.. అక్కినేని నాగసుశీల, అనుమోలు సత్యభూషణరావు దంపతులకు జన్మించాడు సుశాంత్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఇతడు యునైటెడ్ టెక్నాలజీస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో, తన బావ అయిన నాగచైతన్యతో కలిసి ముంబయిలో నటనలో శిక్షణ తీసుకున్నాడు.
బన్నీ, పూజా హెగ్డేతో సుశాంత్ 2008లో 'కాళిదాసు'తో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'కరెంట్', 'అడ్డా', 'ఆటాడుకుందాం రా' సినిమాలు చేశాడు. ఏదీ సరైన రీతిలో ఆదరణ పొందలేదు. 'దొంగాట'లో ఒక అతిథి పాత్రలో మెరిశాడు. 2018లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ చేసిన 'చి.ల.సౌ' మాత్రం ఘన విజయం సాధించింది. కథానాయకుడిగా ఈ హీరో కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. ఆ విజయోత్సాహం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి సందడి చేశాడు. సుశాంత్ తండ్రి తరఫు కుటుంబానికి కూడా చిత్ర పరిశ్రమతో అనుబంధముంది. సుశాంత్ తాత ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థని స్థాపించి 25 చిత్రాలు నిర్మించారు.
ప్రస్తుతం సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం తన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాడీ హీరో.