సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు వైద్యులతో.. ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్). దీంతో పాటు హీరో మృతికి గల కారణాలను ఆ బృందం పరిశీలించనుందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా ఫోరెన్సిక్ అధారాలతో పాటు శవపరీక్షకు సంబంధించిన పత్రాలు, వీడియోలను కమిటీకి అందించింది సీబీఐ.
"సీబీఐ అభ్యర్థన మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేశాం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బోర్డు.. సుశాంత్ శవపరీక్ష నివేదికను పరిశీలించి హత్య కోణంలోనూ అధ్యయనం చేస్తారు. మా బృందం సీబీఐ నుంచి పత్రాలను, వీడియోలను అందుకుంది. ప్రస్తుతం మేము వాటిని పరిశీలిస్తున్నాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత తుది నివేదిక వెల్లడిస్తాం".
-సుధీర్ గుప్తా, ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి
త్వరలోనే తను ముంబయి వెళ్లి, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని సుధీర్ గుప్తా వెల్లడించారు. జూన్ 15న సుశాంత్ పోస్టుమార్టం చేసిన కూపర్ ఆస్పత్రి.. శవపరీక్ష నివేదికలో మరణించిన సమయం రాయకపోవడం గురించి గుప్తా ప్రశ్నలు లేవనెత్తారు. కొద్ది రోజుల్లోనే సీబీఐ, ఎయిమ్స్ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.