బాలీవుడ్ పరిశ్రమ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో రెండు ముక్కలైంది. చూస్తుండగానే నెపోటిజం, ఇన్సైడర్-ఔట్‌సైడర్, మెయిన్‌స్ట్రీమ్ వర్సెస్ ఇండీ సినిమా అంటూ నటీనటులు మాట్లాడటం మొదలుపెట్టారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు ఎదుర్కొంటే, మరికొందరు సహనటులపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు.
34 ఏళ్ల సుశాంత్.. జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన అపార్ట్మెంటులో బలన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్నుంచే చిత్రపరిశ్రమలో లోటుపాట్లపై రగడ మొదలైంది. అయితే ఈ నటుడి మృతిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పలువురు సెలబ్రిటీలు ఆదిత్యా చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ, జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ వంటి వారిని విచారించారు. మరణానికి మానసిక సమస్యలే కారణంగా భావిస్తోన్న తరుణంలో.. చిత్రపరిశ్రమలో కొందరి రాజకీయాల వల్లే సుశాంత్ చనిపోయాడని మరింత చర్చ ప్రారంభమైంది.
ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ నటి కంగనా రనౌత్.. నిర్మాతలు ఆదిత్యా చోప్రా, కరణ్ జోహర్ సహా తాప్సీ, స్వర భాస్కర్, అనురాగ్ కశ్యప్, రణ్వీర్ షోరేపైనా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసింది. అయితే ఇదే సమయంలో అనూహ్యంగా బాలీవుడ్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా. తప్పడ్, ముల్క్ వంటి చిత్రాలతో తప్ప తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ను వదిలి భారతీయ సినిమాకు వెళ్లు అంటూ.. సిన్హా నిర్ణయానికి స్పందించారు మరో దర్శకుడు సుధీర్ మిశ్రా.
ఆ తర్వాత రాజ్‌పుత్ మరణాన్ని హత్యగా పోల్చిన కంగన.. పలువురు సెలబ్రిటీలపై విమర్శలు గుప్పించింది. బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులు సుశాంత్‌ను ఫ్లాప్ స్టార్‌గా ప్రమోట్ చేశారని ఆరోపించింది. 'పంగా' సినిమాలో తన సహనటి రిచా చద్దాను, 'తను వెడ్స్ మను' సహనటి స్వర భాస్కర్ సహా మరో నటి తాప్సీని వివాదంలోకి లాగింది కంగన. వారు బంధుప్రీతిపై మాట్లాడటం లేదని ఆరోపిస్తూ.. 'బీ గ్రేడ్' స్టార్లుగా పోల్చింది.
కంగన.. కౌంటర్‌కు ఊరుకోని తాప్సీ.. గతంలో రనౌత్ స్టార్ వారసుల గురించి మాట్లాడిన త్రో బ్యాక్ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో కోటా ఉన్నట్లే.. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు కోటా ఉంటుందన్న కంగన వ్యాఖ్యలపై విమర్శలు చేసింది తాప్సీ. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. పిలిచినప్పుడు గదికి వెళ్లకపోతే హీరోయిన్లను సినిమాల నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాలీవుడ్లో ఇన్సైడర్స్(వారసులు)-అవుట్‌సైడర్స్(ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వచ్చినవాళ్లు)అని రెండు వర్గాలు ఉన్నాయని చెప్పిన రిచా.. ఇందులోనూ మంచి, చెడ్డ వ్యక్తులు ఉన్నారని స్పష్టం చేసింది.
అయితే సుశాంత్ విషయంలో సినీ పరిశ్రమ తీరును ఎండగట్టేలా మాట్లాడిన రనౌత్‌పై ప్రశంసలు కురిపించాడు అపూర్వ అశ్రాని. నెపోటిజం అంశంపై మాట్లాడటాన్ని స్వాగతించాడు. కంగానకు మద్దతుగా సిమి గరెవాల్ నిలిచింది. బంధుప్రీతి నుంచి మూవీ మాఫియా వంటి అంశాలపై ఘాటుగా స్పందిస్తోన్న నటి కంగన..ఓ ధైర్యవంతురాలని ఆమె కితాబిచ్చింది. అయితే అనూహ్యంగా రనౌత్ నటించిన క్వీన్ సినిమా నిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా ఈ వివాదంలోకి చేరాడు. విజయాలు, పవర్ అనేవి అందర్నీ ఒకే విధంగా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పాడు. అయితే కశ్యప్ విషయంలోనూ రాజీ పడని కంగన.. అతడిపైనా ఫైర్ అయింది. మినీ మహేశ్ భట్ అంటూ సంభోదించింది. తనపై విమర్శలకు స్పందించిన కశ్యప్.. తనవైపు మాట్లాడకపోతే కంగన శత్రువుగా భావిస్తుందని చెప్పుకొచ్చాడు. అలాంటి భావాల నుంచి బయటకు రావాలని సూచించాడు.
సుశాంత్ అరంగేట్ర సినిమా 'కై పో చే' తీసిన ముఖేశ్ ఛబ్రా.. అదే యువ హీరో ఆఖరి చిత్రం 'దిల్ బెచారా'ను తెరకెక్కించాడు. అయితే తన స్నేహితుడు చివరి సినిమా చూడలేదన్న బాధ ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. హీరో మృతిపై మాట్లాడిన విద్యాబాలన్.. అతడు ఎందుకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడో తెలియదని ఇంకెప్పటికీ అది రహస్యమే అని అభిప్రాయపడింది. అయితే సైలెంట్‌గా ఉండటం వల్ల అతడికి గౌరవం ఇచ్చినవాళ్లం అవుతామని పేర్కొంది.