ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా ఏంటి..? అంటే 'దిల్ బెచారా' అని ఎవరైనా చెప్తారు. కానీ.. సుశాంత్ దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కాల్సిన సినిమానట అది. ఆ దాడి చేసిన కసబ్‌ను భారత ప్రభుత్వం ఉరితీసింది. జూన్ 13న సుశాంత్ ఈ సినిమా గురించి చర్చలు జరిపినట్లు ఇండియాటుడే తన కథనంలో పేర్కొంది.
ఉగ్రవాది కసబ్ సినిమాకు ఓకే చెప్పిన సుశాంత్!
ముంబయి 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాకు బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ చర్చలు జరిపాడట. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి దర్శక నిర్మాతలతో సుశాంత్ ఫొన్లో సంభాషించినట్లు ఓ కథనం పేర్కొంది.
దీనికి సంబంధించి కార్నర్‌స్టోన్ ఎల్ఎల్‌పీకి చెందిన ఉదయ్‌సింగ్ గౌరీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారట. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు సుశాంత్‌కు ఉదయ్‌సింగ్ ఫోన్ చేశాడు. అంతేకాదు.. సినిమా డైరెక్టర్ నిఖిల్ అడ్వాణీ, నిర్మాత రమేశ్ తౌరాణీని కాన్ఫరెన్సులో కలిపాడు. ఏడు నిమిషాల పాటు ఆ ముగ్గురితో సుశాంత్ సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. గౌరీ కాల్ రికార్డులు పరిశీలించిన తర్వాత.. అతను సుశాంత్‌కు ఐదుసార్లు ఫోన్ చేసినట్లు తేలింది. కరోనా వైరస్.. లాక్‌డౌన్ కారణంగా నేరుగా కలుసుకోవడం కుదరదని వాళ్లు.. ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలిసింది. వీళ్లు ఫోన్ మాట్లాడుకున్న తర్వాతి రోజు జూన్ 14న సుశాంత్ మరణించడం వల్ల ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఈ కేసు దేశంలో దుమారం రేపింది. ఈ కేసు విచారణలో ఉండగానే డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది.