భారత్లో ఈ ఏడాది అంతర్జాలంలో అత్యధికంగా వెతికిన పేర్లను, కార్యక్రమాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ యాహూ మంగళవారం వెల్లడించింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరును నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారని పేర్కొంది. నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆ జాబితా తెలియజేస్తోంది. జూన్లో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ పేరు ఎక్కువగా ట్రెండ్ అయ్యిందని యాహూ సర్వే తెలిపింది.
భారత్లో అత్యధికంగా నెట్టింట శోధించిన పురుష సెలబ్రిటీ సుశాంత్ అని.. మహిళల్లో నటి రియా చక్రవర్తి గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపారని యాహూ వెల్లడించింది.
"2020లో సుశాంత్ రాజ్పుత్ గురించి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల.. భారత్లో 'అత్యంత శోధించిన వ్యక్తి'గా దివంగత నటుడు సుశాంత్ నిలిచాడు. సుశాంత్ రాజ్పుత్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలు ఈ ఏడాది ఎక్కువగా శోధించిన టాప్-10లోని దివంగత ప్రముఖులైతే.. ఆ జాబితాలో సుశాంత్ తొలిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు" అని యాహూ సంస్థ వెల్లడించింది.