బాలీవుడ్లో ఎలాంటి విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడే లేడీ డాన్, నటి కంగనా రనౌత్ కీలక ప్రకటన చేసింది. యువహీరో సుశాంత్ మరణం వెనుక చాలా మంది బంధుప్రీతి కుట్రలున్నాయని ఆరోపించింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై ముంబయి పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని.. వాటిని నిరూపించుకోలేని పక్షంలో పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని వెల్లడించింది.
పారిపోలేదు...!
సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబయి పోలీసులు తాను మనాలీలో ఉండగా ఫోన్ చేశారని.. రిపోర్టు తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా పంపలేదని ఆరోపించింది. తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడతానని.. పారిపోయే వ్యక్తిని కానని స్పష్టం చేసింది.
జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హిందీ చిత్రసీమలో నెపోటిజంపై విమర్శలు వచ్చాయి. వాటిల్లో మహేశ్ భట్, కరణ్ జోహర్ వంటి నిర్మాతల పాత్ర ఉందని పరోక్షంగా ఘాటు విమర్శలు చేసింది కంగన. ఆత్మహత్యా? లేదంటే ప్రణాళిక ప్రకారం చేసిన హత్యా? అనేది తేల్చాలని ఆమె కోరింది. ఇది సోషల్మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.