బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించిన వాదనలను సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విననుంది. ఈ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసుల ప్రవర్తనతో దేశమంతా ఆశ్చర్యానికి లోనైందని.. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని పిటిషనర్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్.. జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో దీనికి పోటీగా బిహార్‌లో మరో కేసు నమోదయ్యింది.
స్వతంత్ర దర్యాప్తు అవసరం
సుశాంత్ మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని భారతీయ జనతా పార్టీ నాయకుడు, న్యాయవాది అజయ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతి వెనకున్న నిజనిజాలు తెలియడానికి సీబీఐ దర్యాప్తును కోరుతూ.. పిల్ దాఖలు చేశారు. ముంబయి పోలీసుల దర్యాప్తులో లొసుగులు ఉన్నట్లు మరో అఫిడవిట్లో పేర్కొన్నారు న్యాయవాది అజయ్ అగర్వాల్.
అయితే ఈ కేసు విచారణలో భాగంగా దీనికి సంబంధించిన వార్తలను మీడియా నిలిపి వేయాలని కోరారు. అంతేకాదు, స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.