బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ప్రేయసి రియా చక్రవర్తితో సహా స్నేహితులను విచారిస్తోంది. ఈ కేసులో రియాతో పాటు రాజ్‌పుత్ స్నేహితుల డిజిటల్ పాదముద్రలను ఛేదించడమే లక్ష్యంగా దర్యాప్తు బృందం ముంబయిలో అడుగుపెట్టింది. సుశాంత్ మృతి జూన్‌లో జరిగినందున ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉంటారని అధికారులు మొదట ఆందోళన చెందారు.
కొన్ని వార్తా సంస్థల సమాచారం మేరకు రియాకు సంబంధించిన చరవాణి, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పటికే సీబీఐ, ఈడీలు జప్తు చేశాయి. అప్పటికే వాటిలో చాలా సమాచారం అదృశ్యమైనందున.. తొలగించిన డేటాను తిరిగి పొందేందుకు వాటిని క్లోన్ చేశారని తెలుస్తోంది. దీని ద్వారా సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి.
అందులోని ముఖ్యమైన అభియోగాలు:
- సుశాంత్ డెబిట్ కార్డు పాస్‌వర్డ్‌లను రియా దొంగిలించిందని.. దానికి హీరో హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరండా సహాయం తీసుకుందని తెలుస్తోంది.
- సుశాంత్ మరణం తర్వాత రియా, శామ్యూల్ కలిసి అతడి డబ్బును తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని అంతర్గత పత్రాలు తెలియజేశాయి.
- ఆగస్టు నెల ప్రారంభంలో మిరండాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విరివిగా ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.
- సుశాంత్ డెబిట్ కార్డుల పాస్‌వర్డ్‌లను రియా ఎందుకు దొంగిలించిందనే విషయంపై ఏజెన్సీలు ప్రస్తుతం విచారిస్తున్నాయి. కాగా రియా, శామ్యూల్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
- డ్రగ్ డీలర్స్‌తో రియాకు సంబంధం ఉందని బహిరంగంగా వెల్లడైన తర్వాత ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ చేపట్టింది.
జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. తొలుత నెపోటిజమ్ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయడం, కొన్నిరోజులకు కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.