గయ్యాళి అత్త అనగానే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. ఎన్ని తరాలు మారినా తెలుగుదనం ఉన్నంత వరకు గుర్తుండిపోయే సహజ నటి! పాత్రను పరిపూర్ణంగా సొంతం చేసుకోవడం అంటే ఏమిటో.. అదెలా సాధ్యమో ఆమే నటనను చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆంగికం, వాచకం, అభినయం కలగలిసిన త్రివేణీ సంగమం- మన సూర్యకాంతం! నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
అప్పట్లోనే అల్లరి పిల్లగా
1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతానికి చిన్నప్పుడే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిందట. స్కూల్లో పంతులమ్మని ఏడిపించడం, ఊళ్ళో సైకిల్ మీద చక్కర్లు కొట్టడం, సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్లు మాట్లడడం ఆమెకు చిన్నప్పుడే అలవడ్డాయట!
సినీరంగ ప్రవేశం
కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్ నాటకాల్లో వేషాలు వెయ్యడం ద్వారా ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, యస్వీ రంగారావులాంటి ప్రముఖులతో పరిచయమై, ఆమె ఆసక్తి వెండితెరవైపు మళ్లింది. నృత్య సన్నివేశాల్లో గుంపులో కనిపించడం, కథానాయకుల పక్కన చెలికత్తెగా నటించడం లాంటి పాత్రలు చేసింది.
ఫేస్‌వాల్యూ
మాటల మధ్యలో ముక్కు ఎగపీలుస్తూ, గొంతులో దుఃఖం పలికిస్తూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకునే ఘట్టాల్లో సూర్యకాంతాన్ని చూడండి- నిజజీవితంలో మనకు బాగా తెలిసిన వారు కనిపిస్తారు. మెటికెలు విరుస్తూ, శాపనార్థాలు పెడుతూ, తిట్ల వర్షం కురిపించినప్పుడు- ‘అచ్చం మన లాగే ఉంది కదంటూ’ ప్రేక్షకులు తమ సన్నిహితులతో సరిపోల్చుకుంటారు. ఒక తరంలో గయ్యాళితనానికి సూర్యకాంతం పేరు పర్యాయపదమైపోయిందంటే అతిశయోక్తి కాదు.