Suriya jai bhim oscar: తమిళ హీరో సూర్య అరుదైన ఘనత సాధించారు. 'ఆకాశం నీ హద్దురా!' సినిమాతో గతేడాది ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైన సూర్య.. ఈ ఏడాది 'జై భీమ్' చిత్రంతో దానిని రిపీట్ చేశారు.
మొత్తంగా ఆస్కార్స్ కోసం ఈసారి 276 సినిమాలు ఎంపికవగా, మన దేశం నుంచి ఈ ఏడాది రెండు చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవకాశం దక్కించుకున్నాయి. అందులో సూర్య 'జై భీమ్', మోహన్‌లాల్ 'మరక్కర్' ఉన్నాయి. ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27-ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి.
ఆస్కార్‌కు ఎంపికైన వాటిలో 'బీయింగ్ ద రికార్డస్', బెల్ఫాస్ట్, కోడా, డ్యూన్', 'ఎన్ కాంటో', 'హౌస్ ఆఫ్ గస్సీ', 'ద పవర్ ఆఫ్ ది డాగ్', 'ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2', స్పెన్సర్, 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్', 'వెస్ట్ సైడ్ స్టోరీ' తదితర సినిమాలు ఉన్నాయి.
1993లో తమిళనాడులో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'జై భీమ్' నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రంలో వన్నియర్ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళ ప్రాంతీయ పార్టీ ఒకటి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అవేవి సినిమా ప్రేక్షకాదరణ పొందడాన్ని ఆపలేకపోయాయి. ఇందులో సూర్య, గిరిజనుల తరఫున పోరాడిన చంద్రు అనే న్యాయవాదిగా మెప్పించే ప్రదర్శన చేశారు.