"చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాటిలో నుంచే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాబట్టి ప్రతి పెద్ద బ్యానర్ తప్పకుండా చిన్న చిత్రాలు తీయాలి. ప్రస్తుతం ఆ ఒరవడి తెలుగులో బాగానే కనిపిస్తోంది. అది ఇంకా పెరగాలి. ఓ చిన్న సినిమాని హిట్ చేయగలిగితే ఆ వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం" అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ఇప్పుడామె నిర్మాణంలో రూపొందిన చిత్రమే 'అనుభవించు రాజా'. రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటించారు. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుప్రియ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
అన్నపూర్ణ స్టూడియోస్ కథలన్నీ తొలుత మీరే వింటారా?
ఈ బ్యానర్ మీద చేసే సినిమా కథలన్నీ దాదాపుగా నేనే వింటాను. స్క్రిప్ట్ బాగుంది.. సినిమాగా మలచొచ్చని ఏమాత్రం అనిపించినా ఆయా నటీనటులకు పంపిస్తాను. ఒకవేళ నాగార్జున మామ, చైతన్య హీరోలుగా కథలు వస్తే.. ముందు వాళ్లకే వినిపిస్తా. వేరేవరైనా వాళ్ల కథలతో నా దగ్గరకొచ్చినా.. నేరుగా వాళ్లకే వినిపించమని చెప్పేస్తుంటాను.
సుప్రియకు కథ చెప్పి.. ఒప్పించడం కష్టమంటారు నిజమేనా?
నేనెప్పుడూ కథ నచ్చితేనే ముందుకెళ్తాను. ఈ చిత్ర కథ వింటున్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వానంటే మరో పదిమంది నవ్వుతారనే కదా. అందుకే విన్న వెంటనే ఈ సినిమా ఒకే చేశా. ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. శ్రీను అలా పారిపోతాడనుకున్నాను. కానీ, ఉన్నాడు. ఓపికగా సినిమా చేశాడు.