తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Rajnikanth: రజనీకాంత్ స్టైల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? - రజనీకాంత్ అన్నాత్త

ఈటీవీ భారత్.. సినీ ప్రముఖల​కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని ప్రతి ఆదివారం​ మీ ముందుకు తీసుకువస్తోంది. ఈ వారం​ ప్రపంచ సినీచరిత్రలో అత్యుత్తమ నటుల్లో ఒకరైన సూపర్​స్టార్ రజనీకాంత్ గురించిన ప్రత్యేక కథనం. అసలు ఏంటీ రజనీ స్టయిల్? సెవెంటీలో సెవెంటీనేజర్​గా ఎలా ఉంటున్నారు?

superstar rajinikanth special
రజనీకాంత్

By

Published : Jun 20, 2021, 9:31 AM IST

Updated : Jun 20, 2021, 1:09 PM IST

దైవానికి దశావతారాలే. కానీ వెండితెర రజనీకాంతుడికి సినిమా సినిమాకు కొత్త అవతారమే. చికిలించే చిన్నకళ్లు. చెదిరిన జుత్తుతో రోమియో తరహా లుక్. 1970ల్లో బెల్‌బాటమ్ జీన్స్. హిప్పీ క్రాఫ్. దశాబ్దానికో విధంగా మార్చుకుంటూ అతడి స్టైల్ ముందుకు సాగింది. అప్పట్లో రజనీ క్రాఫ్.. స్టైలిష్ గ్రాఫ్. ఫ్రెంచ్ కట్ గడ్డం, తలకు స్పార్ఫ్ తో ఓ స్టయిల్. పోలీస్ డ్రెస్ వేస్తే ఉట్టిపడే గాంభీర్యంతో పూర్తిగా నప్పే వేషం.

సొగసైన కళ్లద్దాలు, స్టైలిష్‌తెలుపు కుర్తాలో 'నరసింహ' అవతారం. 'శివాజీ' సినిమాలో సిల్వర్ హెయిర్, బ్లాక్ బ్రష్డ్ హెయిర్. గులాబీ రంగుతో మెరిసే పెదవులతో రోబో హీరో.

సూపర్​స్టార్ రజనీకాంత్

ఆకట్టుకునే సిక్స్ ప్యాక్​లతో కుర్రాళ్లు దూసుకొస్తుంటే రజనీకాంత్ ఆ పోటీని ఎలా తట్టుకున్నారు? హిందీ సినిమా వెండితెరపై శత్రుఘ్న సిన్హా అప్పుడప్పుడూ ఒకటీ అరా విన్యాసాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు వినోదం పంచేలా రజనీకాంత్ చేసే ట్రిక్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి, చేస్తున్నాయి. నటనకు అదనపు విలువ జోడించినట్లు తన విన్యాసాలతో, బాడీ లాంగ్వేజ్​తో రజనీకాంత్ ప్రత్యేక స్టయిల్ ఏర్పర్చుకున్నారు. చాలా సినిమాల్లో కండువాతో రజనీ చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఎజమాన్ సినిమా నుంచి నరసింహ వరకు.. పంచె విన్యాసాలు తెరస్మరణీయం. నరసింహలో నీలాంబరి అహంకారాన్ని తుంచివేసిన దృశ్యం చిరస్మరణీయం. సిగరెట్ గాలిలోకి గిరికీలు కొట్టించి పెదాలతో పట్టి స్టైలుగా ముట్టించటం దక్షిణాదిన మరెవ్వరూ చేయలేదని చెప్పొచ్చేమో!

శివాజీ సినిమాలో చూయింగ్ గమ్​తోనూ ట్రిక్స్ చేయడం రజనీకే చెల్లింది. ఇదే చిత్రంలో ఒక్కరూపాయితో గాలిలో బొమ్మ-బొరుసు వేసి..తిరిగి ఆ నాణెం జేబులో వేసుకునే విన్యాసం అభిమానుల్ని తెగ ఆకట్టుకుంది. పైపు కాల్చటంలో రజనీ స్టయిల్..జుత్తు పైకి దువ్వినా, బ్లేజర్ గిరగిరా తిప్పి భుజాన వేసుకున్నా ఆ స్టయిలే స్టయిలు. సన్ గ్లాసెస్​తో విన్యాసాలు అన్నీ ఇన్నీకావు.

బాషా, నరసింహ, చంద్రముఖి, రోబో.. ఇంకా చాలా చిత్రాల్లో కూలింగ్ గ్లాసెస్​తో రజనీకాంత్ మ్యాజిక్స్ చూడముచ్చటగా ఉంటాయి. రజనీకాంత్ దర్బార్ సినిమాలో వాడిన సన్ గ్లాసెస్‌తో స్టయిలిష్​గా కన్పించారు. కాలా సినిమాలో ఆయన ఉపయోగించిన కూలింగ్ గ్లాసెస్ మార్కెట్లో కాలా గ్లాసెస్​గా ప్రాచుర్యం పొందాయి. 1940, 1960ల్లో కళ్లజోళ్ల ఫ్రేములు మళ్లీ రజనీ స్టయిల్లో ట్రెండీ ఫ్యాషన్ సెన్సేషన్స్​గా దూసుకొచ్చాయి. రజనీకాంత్ కబాలీలో వింటేజ్ కూలింగ్ గ్లాసెస్ ధరించి వాటి ఆకర్షణను రెట్టింపు చేశారు. డిస్కవరీలో 'ఇన్​టూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్​కు కళ్లజోడు ఫ్లిఫ్ చేయటం నేర్పారు రజనీ. ఏడుపదుల రజనీ ఉత్సాహం చూసి బేర్​గ్రిల్స్ ఆశ్యర్యపోవడం విశేషం.

బేర్​గ్రిల్స్​తో రజనీకాంత్

యువహీరోలకు సాధ్యం కాని మ్యాజిక్ రజనీ స్టైల్‌. స్టైల్‌, బాడీ లాంగ్వేజ్, డైలాగులలో పంచ్ వల్ల దశాబ్దాల తరబడి ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. భాషతో సంబంధం లేకుండా డైలాగుల యాస, నటనే శ్వాసగా, చిత్ర విచిత్ర విన్యాసాలతో నటిస్తుంటే అభిమాన ప్రపంచం ఫిదా అయ్యింది. సదా ఆయన వెంటే నడిచింది. 70 ఏళ్ల వయసులోనూ ఫైట్లు ఆయనకే సాధ్యం.

ఇప్పటివరకు 168 సినిమాల్లో నటించిన రజనీకాంత్.. అత్యధికంగా పాతిక చిత్రాలలో ఎస్పీఎమ్​గా ప్రసిద్ధి చెందిన ఎస్పీ ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 సినిమాలు చేశారు. తనను సూపర్​స్టార్​గా నిలబెట్టింది నాటి ముత్తురామన్ చిత్రాలే. తర్వాత కాలంలో నవయువ దర్శకులను ప్రోత్సహిస్తూ కొత్త కథలను ఎన్నుకుంటున్నారు రజనీ. దేశవిదేశాలలో స్టయిల్స్​ను అధ్యయనం చేస్తుంటారు. ఫ్యాషన్ పోకడలను గమనిస్తూ అనుసరిస్తుంటారు.

రజనీకాంతుడు ఆధ్యాత్మికుడు. అతడి మనసే మందిరం.. హిమాలయమంత ఎత్తు మానవతాశిఖరం,. ఏటేటా హిమాలయ దర్శనం.. ధ్యానం. తమిళంలో ఆయనే నటించిన శ్రీ రాఘవేంద్ర సినిమా 1985లో తెలుగులో శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటన, వైవిధ్య పాత్రలు, నూతన దర్శకుల ఎంపిక, ప్రతి విషయంలో తీసుకునే జాగ్రత్తలు రజనీకాంత్ శిఖరం అంచున ఉంచాయి. రజనీకాంత్‌ ఇంకా యువ హీరోలకంటే దూకుడుగా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ నాలుగున్నర దశాబ్దాలు వెండితెరపై ఏకఛత్రంగా అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నారు. రాళ్లు పడుతున్నప్పుడు తట్టుకోవాలి. పూలు పడుతున్నప్పుడు తప్పుకోవాలి. ఇదే రజనీ సిద్ధాంతం. పొగడ్తలకు దూరంగా ఉంటారు. ఆయన ముళ్లదారిని పూలబాటగా మలుచుకున్నారు. శిలాఫలకాల మీద మిగలటం కాదు..ప్రజల మనో ఫలకాలపై మిగలాలి. రజనీకాంత్‌ వెనకడుగు వేసినప్పుడల్లా వేయి ఏనుగుల బలంతో ముందుకు వచ్చారు. తలెత్తుకుని వచ్చి శిఖరమయ్యారు. ఏడుపదుల వయసులోనూ వెండితెరపై సునామీలు సృష్టిస్తున్నారు. అందుకే రజనీకాంత్ కాలాతీత కథానాయకుడు.

దర్బార్​లో రజనీకాంత్
Last Updated : Jun 20, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details