తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీని తిట్టిన నిర్మాత... కసితో ఫారిన్​ కారు కొన్న తలైవా - Bhuvana Oru Kelvikkuri

సూపర్​స్టార్​ రజనీకాంత్​, ప్రముఖ దర్శకుడు మురుగదాస్​ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'దర్బార్​'. డిసెంబర్​ 12న తలైవా పుట్టినరోజు కానుకగా... ఈ సినిమా ఆడియో లాంచ్​ శనివారం రాత్రి నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో రజనీ.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

darbar audio launch
రజనీని తిట్టిన నిర్మాత... కసితో ఫారిన్​ కారు కొన్న తలైవా

By

Published : Dec 8, 2019, 10:06 AM IST

"నా విజయంలో కృషి, పట్టుదల మాత్రమే కాదు.. దర్శకనిర్మాతలు కూడా ప్రధాన కారణం. జీవితంలో గెలవాలంటే సమయం, పరిస్థితులు అనుకూలించాలి" అన్నాడు సూపర్​స్టార్​ రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దర్బార్‌'. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. నివేదా థామస్‌ కీలక పాత్రధారిగా నటిస్తోంది. సునీల్‌ శెట్టి ప్రతినాయకుడిగా ఆకట్టుకోనున్నాడు. అనిరుధ్‌ స్వరాలు అందించాడు. సుభాస్కరన్‌ సినిమాను నిర్మించారు.

దర్బార్​లో రజనీకాంత్​

పాటలు వచ్చేశాయి...

దర్బార్​ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్​, లిరికల్​ వీడియోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్​ 12న తలైవా పుట్టినరోజు సందర్భంగా... ముందస్తు కానుకగా శనివారం చెన్నైలో పాటలను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ​వేదికపై మాట్లాడిన రజనీకాంత్‌... తన సినీ ప్రయాణం ఎలా మొదలైంది.? స్టార్​ హీరోగా ఎదగడం వెనుక కారణాన్ని చెప్పుకొచ్చాడు.

నమ్మకంతోనే తొలి ప్రయాణం...

" పదవ తరగతి చదివేటప్పుడు ఇంట్లోవాళ్లు పరీక్షల ఫీజు కోసం రూ.150 ఇచ్చారు. అయితే పరీక్ష ఫెయిల్‌ అవుతానని నాకు తెలుసు. అందుకే మద్రాస్‌ రైలెక్కాను. టికెట్‌ ఎక్కడో పడిపోయింది. టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆ విషయం చెప్పినా జరిమానా కట్టాల్సిందేనని అందరి ముందు అరిచాడు. అప్పుడు ఐదుగురు కూలీలు నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను డబ్బు లేక టికెట్‌ తీసుకోలేదనుకుంటున్నారేమో. కానీ నేను టికెట్ తీసుకున్నానన్నది నిజం. ఆవిషయాన్ని టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెబుతున్నా నమ్మడం లేదని వాళ్లతో చెప్పా. ఆ మాటలు విన్న ఇన్‌స్పెక్టర్‌ నన్ను నమ్మాడు. అదే తొలిసారి ఓ తెలియని వ్యక్తి నన్ను నమ్మడం. ఆ తర్వాత మద్రాస్‌కు వచ్చాక కె.బాలచందర్‌ నాపై నమ్మకముంచారు. దాన్ని గెలిపించుకున్నాను. ఇప్పుడు ప్రజలు నామీద నమ్మకం పెట్టుకున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కాదు".
--రజనీకాంత్​, సినీ నటుడు

వీటితో పాటు తన జీవితంలో జరిగిన ఓ బాధాకర సంఘటనను రజనీ వేడుకలో పంచుకున్నాడు. ఆ కసి నుంచి వచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా స్టార్​ అయ్యాడో చెప్పాడు తలైవా.

దర్బార్​ పాటలో రజనీ

" నా జీవితంలో ఓ బాధాకర ఘటన జరిగింది. 16 వయదినిలే అనే చిత్రం తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నాడు. కానీ సెట్‌కు వెళ్లేవరకూ అడ్వాన్స్‌ ఇవ్వలేదు. డబ్బులు ఇస్తేనే నటిస్తానని తెగేసి చెప్పాను. అప్పుడాయన 'ఏరా నీకంత పొగరు. నీకు వేషం లేదు. ఇంటికి వెళ్లిపో' అని అరిచాడు. నాకు చాలా బాధేసింది. ఆ కసితోనే ఎదగాలనుకున్నాను. ఆ తర్వాత రెండున్నర ఏళ్లలో ఫారిన్‌ కారు కొన్నాను".

--రజనీకాంత్​, సినీ నటుడు

దర్బార్‌ చిత్రం గురించి రజనీ మాట్లాడుతూ... " శివాజీ టైమ్‌లోనే మురుగదాస్‌ ఈ కథ చెప్పారు. నేను అనుకున్నదానికన్నా బాగా తెరకెక్కించారు. 'దళపతి' తర్వాత 29 ఏళ్ల అనంతరం మళ్లీ సంతోష్‌ శివన్‌ నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అనిరుధ్‌ నా ఇంటి బిడ్డ" అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details